మళ్లీ పోస్ట్​మార్టం చేయిస్తం : హైకోర్టు

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది..వద్దు : ఏజీ
అభ్యంతరాలుంటే సుప్రీంకు వెళ్లాలని సూచన 
విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, వెలుగు : దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌లో చనిపోయిన నలుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయడానికి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్‌‌ నిపుణులను రప్పిస్తామని చెప్పింది. ఎన్​కౌంటర్​పై అనుమానాలున్నాయని ఈ నెల17న కొన్ని మహిళా సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లగా డెడ్​బాడీలు, ఇతర విషయాలకు సంబంధించి హైకోర్టులో తేల్చుకోవాలని  మృతదేహాలను భద్రంగా ఉంచాలని కోర్టు చెప్పింది. దీంతో శుక్రవారం హైకోర్టు మరోసారి ఆ  పిల్‌‌ను విచారించింది. పోస్టుమార్టం నిర్వహించేప్పుడు వీడియో తీయిస్తామని, తర్వాత డెడ్​బాడీలకు కుటుంబాలకు అప్పజెప్పేలా ఉత్తర్వులు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ పేర్కొంది. దీనిని అడ్వకేట్ జనరల్​ బి.ఎస్‌‌.ప్రసాద్‌‌ వ్యతిరేకించారు.

ఇదివరకు సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారమే పోస్టుమార్టం జరిగిందని, మరోసారి చేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ చేయాలని అనుకున్నా తెలంగాణలోనే చేసేలా ఆర్డర్‌‌ ఇవ్వాలని, వేరే రాష్ట్రాల్లో చేస్తే రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై డివిజన్‌‌ బెంచ్‌‌ కూడా తీవ్రంగానే స్పందించింది. ‘ఎన్‌‌కౌంటర్‌‌పై రాష్ట్రం..దేశమే కాదు..మొత్తం ప్రపంచం ఏమవుతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ ప్రతిష్టతోపాటు న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా ముడిపడి ఉంది. వీటిని ఫణంగా పెట్టలేం. అసలు రెండోసారి పోస్టుమార్టం చేస్తే ఏమవుతుంది? ప్రభుత్వం ఏకారణాలతో వ్యతిరేకిస్తోందో చెప్పాలి’ అని ప్రశ్నించింది.  సుప్రీంకోర్టు కలెక్షన్‌‌ ఆఫ్‌‌ ఎవిడెన్స్​అనే పదం వాడిందని, వాస్తవాలు తేలాలంటే రెండోసారి పోస్టుమార్టం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్డు ఇచ్చే ఆర్డర్‌‌తో సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని హితవు పలికింది. అయితే ప్రభుత్వ వైఖరి చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను శనివారానికి వాయిదా వేసింది. మృతదేహాలు చెడిపోతున్నాయని గాంధీ ఆస్పత్రి వర్గాలు కూడా చెప్పాయని, శనివారం విచారణకు గాంధీ సూపరింటెండెంట్‌‌ కూడా రావాలని ఆదేశించింది.

‘దిశ నిందితుల డెడ్​బాడీలకు మళ్లీ పోస్టుమార్టం చేయాలని ఆదేశాలిస్తాం. ఢిల్లీకి చెందిన నిపుణులను రప్పిస్తాం. ఈ కేసు గురించి దేశమే కాదు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది పోలీసులు, ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు. న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా ముడిపడి ఉందన్న సంగతి గుర్తుంచుకోండి. మేము ఇవ్వబోయే ఆదేశాలపై అభ్యంతరాలుంటే మీరు సుప్రీం కోర్టుకు వెళ్లండి’ – దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై దాఖలైన పిల్​పై విచారణ సందర్భంగా హైకోర్టు.

Latest Updates