జూన్‌‌‌‌ పాయె, జులై పాయె…గొర్రె పిల్ల రాకపాయె

  • రెండో విడత కోసం గొల్ల కురుమల ఎదురుచూపు
  • ఐదు నెలలుగా నిలిచిన గొర్రెల పంపిణీ
  • ఈసారి డబ్బులిస్తరా? గొర్రెలిస్తరా? తేల్చని ప్రభుత్వం
  • డీడీలు కట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
  • మొత్తం టార్గెట్‌‌‌‌లో ఇప్పటికి సగమే పూర్తి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఐదు నెలలుగా రాష్ట్రంలో గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. దీంతో  అప్పులు చేసి డీడీలు కట్టి రెండో విడతపై ఆశలు పెట్టుకున్న గొల్ల కురుమలు నిరాశలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 3 లక్షల 63 వేల 385 కుటుంబాలకు గొర్రెలు అందాల్సి ఉంది. 2017 జూన్‌‌‌‌ 20న ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభించింది. ఏడు లక్షల 29 వేల 67 కుటుంబాలకు పంపిణీ చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. దీన్ని రెండేళ్లలో పూర్తి చేయాలనుకున్నా ఇప్పటికీ 50 శాతమే పూర్తి చేశారు. దీంతో గడువును మరో ఆర్నెల్లు పొడిగించారు.

ఇదే అదును.. ఇవ్వండి

వేసవిలో గొర్రెలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడంలో ఇబ్బందులొస్తాయని, జూన్‌‌‌‌ మొదటి వారంలో పంపిణీ చేస్తామని మార్చిలో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ప్రకటించారు. జూన్‌‌‌‌, జులై వెళ్లిపోయినా ఇంకా పంపిణీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వానలు పడుతున్నందున గొర్రెలు పంపిణీ చేయాలని గొల్ల కురుమలు కోరుతున్నారు. ఇటీవల ఖమ్మం, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌తోపాటు పలు జిల్లాల్లో గొల్ల కురుమలు ర్యాలీలు, నిరసనలు తెలుపుతూ కలెక్టర్లకు వినితిపత్రాలిచ్చారు.

డీడీలు తీసి వెయిటింగ్‌‌‌‌

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డీడీలు తీసి గొర్రెల కోసం వేచి చూస్తున్నారు. జనగామ జిల్లాలో 4,300 మంది, వరంగల్‌‌‌‌ అర్బన్‌‌‌‌ జిల్లాలో 2,600 మంది, కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 3,000 మంది, భువనగిరి జిల్లాలో 1,820, గద్వాల, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, సిద్దిపేట తదితర జిల్లాల్లో 18 వేల మందితోపాటు ఇతర జిల్లాల్లో అనేక మంది డీడీలు తీసి పది నెలలుగా గొర్రెల కోసం వేచిచూస్తున్నారు.

లేటుకు అక్రమాలే కారణమా?

తొలి విడత పంపిణీలో అక్రమాలు జరగడం వల్లే ఈ సారి పంపిణీ ఆలస్యమవుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. లబ్ధిదారుల కంటే అధికారులు, దళారులే ఎక్కువ బాగుపడ్డారనే ఆరోపణలున్నాయి.రీసైక్లింగ్‌‌‌‌, పేపర్‌‌‌‌ గ్రౌండింగ్‌‌‌‌ చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో టెండర్లు ద్వారా గొర్రెలను సేకరించాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. రైతు బంధు తరహాలో గొర్రెల కాపర్లకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులేస్తే ఎలా ఉంటుందన్న ఆచోచన కూడా చేస్తున్నారని సమాచారం.

ప్రగతి భవన్‌‌‌‌ ముట్టడిస్తం

ఎన్నికల ముందు హడావుడి చేశారు. ఇప్పుడా ఊసే లేదు. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌‌‌‌ ఎలక్షన్లలో గొర్రెల పెంపకం దార్ల ప్రభావం తక్కువ. అందుకే రెండో విడతను పట్టించుకోట్లే. లక్షలాది మంది డీడీల కోసం అప్పు చేశారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రగతి భవన్‌‌‌‌ ముట్టడిస్తం. – ఉడుత రవీందర్‌‌‌‌, జీఎంపీఎస్‌‌‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

స్కీం పెట్టినా గొర్రెలు పెరగలె..

పశుసంవర్థకశాఖ గణాంకాల ప్రకారం 2012లో రాష్ట్రంలో కోటీ 28 లక్షల గొర్రెలున్నాయి. తాజా లెక్కల ప్రకారం కోటీ 93 లక్షల వరకు ఉన్నాయి. అంటే ఏడేళ్లలో 65 లక్షల గొర్రెలే పెరిగాయి. ఇందులో 2017 నుంచి 2019 వరకు ప్రభుత్వం 76 లక్షల గొర్రెల్ని పంపిణీ చేసింది. దీన్ని బట్టి గొర్రెల పెంపకం సాధారణ వృద్ధిని కూడా నమోదు చేయలేదన్నమాట.

Latest Updates