దివ్య హత్యకేసు: పోలీసుల ముందు లొంగిపోయిన వెంకటేశ్

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో దివ్య అనే యువతిని వెంకటేశ్ గౌడ్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో నిన్నటి(మంగళవారం) నుంచి పరారీలో ఉన్న వెంకటేశ్ ఇవాళ(బుధవారం)  సాయంత్రం వేములవాడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంకటేశ్ ను విచారణ కోసం గజ్వేల్ కు తరలించారు.

వేములవాడకు చెందిన వెంకటేష్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వెంకటేష్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. అంతేకాదు పెళ్లి టైంలో దివ్య మైనర్.

విడిపోయిన తర్వాత వెంకటేశ్ వేధిస్తుండడంతో ఆమె తల్లితండ్రులు..2018 అక్టోబర్ 9న ఎల్లారెడ్డి పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, …మరోసారి దివ్య జోలికి రాను అని అతడు కాగితం రాసిచ్చాడని తెలిపారు. అయితే కొంతకాలం కిందట దివ్యకు బ్యాంకులో ఉద్యోగం రావడంతో పాటు… వరంగల్ కు చెందిన సందీప్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.

ఈ నెల 26న పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వెంకటేశ్ తనకు దక్కని దివ్య మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో గొంతుకోసి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్రగాయాలపాలైన దివ్య అక్కడిక్కడే మరణించింది. వేములవాడలో వెంకటేశ్ ఇంటికి తాళం వేసి ఉండడంతో అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వెంకటేశ్ స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Latest Updates