
న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితుల్లో విరాళాలు అందించడానికి నెలకొల్పిన ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్, రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ (పీఎం కేర్స్) పై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పలు వ్యాఖ్యలు చేశారు. పీఎం కేర్స్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందన్నారు. అయినా సుదీర్ఘ కాలం అకడెమిక్ సర్కిల్స్‌లో ఈ తీర్పుపై చర్చ జరుగుతుందన్నారు. పీఎం కేర్స్ ఫండ్ విషయంలో సుప్రీం వెలువరించిన తీర్పులో చర్చించాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయని చెప్పారు. పీఎం కేర్స్‌కు ఉన్న పారదర్శకత, నిర్వహణ పద్ధతులను బహిర్గతం చేయాల్సి ఉందన్నారు.
‘పీఎం కేర్స్ ఫండ్‌కు ఉన్న చట్టబద్ధత, జవాబుదారీతనం గురించి సుప్రీం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు శిరోధార్యమే కానీ అకడెమిక్ సర్కిల్స్‌లో దీనిపై సుదీర్ఘ కాలం చర్చ జరుగుతుంది’ అని చిదంబరం ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చి నెలలోని తొలి ఐదు రోజుల్లో పీఎం కేర్స్‌కు రూ.3,076 కోట్లు డొనేట్ చేసిందెవరో బయటపెట్టాలన్నారు. ఆ డోనర్స్‌లో చైనా కంపెనీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి ఫండ్‌కు అందిన డబ్బులు, దాతల వివరాలను వెల్లడించాలన్నారు.