కరోనా టైమ్‌లో కరెంటు బాదుడా?

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు:  కరోనా మహమ్మారి కారణంగా పనులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం కరెంట్​ చార్జీల భారం మోపుతోందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. కరోనా టైంలో జనంపై కరెంటు చార్జీల భారం మోపడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. జనానికి ఇబ్బంది లేకుండా లో లెవెల్​ శ్లాబ్​లో కరెంట్​బిల్లు తీయాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్జీఏ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేక్​ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రధాని మోడీ పనితీరు భేష్

ప్రధాని మోడీ పాలనను ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని, జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ఆర్టికల్​ 370ని రద్దు చేశారని, శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్ షిప్ అమెండ్​మెంట్​ యాక్ట్ తీసుకొచ్చారని వివేక్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కంట్రోల్ చేయడంలో ప్రధాని మోడీ పనితీరు భేష్ అని కొనియాడారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు జన్ ధన్ ఖాతాల ద్వారా సాయం అందజేశారని చెప్పారు.

తక్కువ టెస్టులు చేసి కేంద్రంపై విమర్శలా?

కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేస్తోందని వివేక్​ ఆరోపించారు. అతి తక్కువ టెస్టులు చేసి కరోనా లేనే లేదని గొప్పలకు పోతోందని టీ‌‌ఆర్‌‌ఎస్ సర్కార్​పై మండిపడ్డారు. పీపీ‌‌ఈ కిట్లు లేక చాలా మంది డాక్టర్లు కరోనా వైరస్​ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్​తో కేసీఆర్ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. సీఎంల పనితీరులో దేశంలోనే కేసీఆర్ 16వ స్థానంలో నిలవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు.

పోతిరెడ్డిపాడును  పక్కదారి పట్టించేందుకే..

సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయనడం పచ్చి అబద్ధమని వివేక్​ అన్నారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం కేసీఆర్ కొండపోచమ్మ నీళ్ల తంతు నడిపారని వివేక్​ విమర్శించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచారని, పోతిరెడ్డిపాడు విస్తరణతో మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. కృష్ణా బేసిన్ లో సరైన రీతిలో నిధులు ఖర్చు పెట్టి ఉంటే రైతులకు ఇంకా ప్రయోజనం కలిగేదని అన్నారు. కార్యక్రమంలో బీ‌‌జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు, రంగరాజు రుక్మరావు, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బ భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ నేతలు అడ్డంగా బుక్కయ్యారు

Latest Updates