ఆఫీసర్లకు ఒకలెక్క.. మాకో లెక్కనా!


గ్రాట్యుటీ వర్తింపులో సింగరేణి ఆఫీసర్లు, కార్మికుల మధ్య తేడా

ఈక్వల్​గా ఇవ్వాలని కార్మిక యూనియన్ల డిమాండ్

రూ.400 కోట్లు నష్టపోతున్న రిటైర్డ్ ఉద్యోగులు

మందమర్రి, వెలుగు: సింగరేణిలో రిటైర్డు కార్మికులకు పెరిగిన గ్రాట్యుటీ డబ్బులు అందలేదు. కేంద్ర సర్కార్​ గ్రాట్యుటీని రూ.20లక్షలకు పెంచుతూ నిర్ణయించిన తర్వాత.. సింగరేణిలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగులకు ఆ నిర్ణయాన్ని వర్తింప చేస్తూ.. కిందిస్థాయి ఉద్యోగులకు 14 నెలలకు కొర్రీ పెట్టారు. ఆఫీసర్లకు కార్మికులకు వేర్వేరుగా అమలు చేశారు. కార్మికులు 14 నెలలు నష్టపోయేలా అమలు తేదీని ఖరారు చేశారు. దీంతో ఆ సమయంలో రిటైర్డ్ అయిన 4 వేల మంది కార్మికులు రూ.10 లక్షల చొప్పున 400 కోట్లు నష్టపోయారు. పెరిగిన గ్రాట్యుటీ ప్రకారం రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. శుక్రవారం రాంచీలో జేబీసీసీఐ ఆపెక్స్​ కమిటీ మీటింగ్, 23న స్టాండర్డైజేషన్​ కమిటీ ఎస్​సీ మీటింగ్​ జరుగనున్న నేపథ్యంలో పెరిగిన గ్రాట్యుటీని అమలు చేయాలనే డిమాండ్ ని వినిపించేందుకు కార్మిక సంఘాలు రెడీ అయ్యాయి.

అమలులో తేడా..

కేంద్ర ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచుతూ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2016 జనవరిలో ఆమోదించింది. దీని ప్రకారం కోలిండియాతో పాటు సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్లు, కార్మికులకు వర్తింపజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వేతన సవరణ ఒప్పందాలతో సంబంధం లేకుండా గ్రాట్యుటీ వర్తింపు తేదీని నిర్ణయించాల్సిన సింగరేణి కంపెనీ.. రిటైర్ అయిన ఆఫీసర్లకు 2017 జనవరి నుంచి, కార్మికులకు 2018 ఫిబ్రవరి తర్వాత నుంచి వర్తింపజేసింది. దీంతో  ఆ 14 నెలల కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు పెంచిన గ్రాట్యుటీని కోల్పోయారు. ఆఫీసర్ల మాదిరే కార్మికులకు కూడా వర్తింపజేయాలని యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి. యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బొగ్గుగని కార్మికుల పదో వేతన సవరణ 2016, జులై 1 నుంచి అమలు కావాల్సి ఉండగా దీనిపై 2017 అక్టోబర్​ 1న ఒప్పందం కుదిరింది. గ్రాట్యుటీ మాత్రం 2018 ఫిబ్రవరి తర్వాత నుంచి అమలు చేసేందుకు నిర్ణయించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆఫీసర్ల వేతన సవరణ 2017 జనవరి నుంచి అమలు కావడంతో అప్పటి నుంచే పెంచిన గ్రాట్యుటీని వారికి వర్తింపజేస్తున్నారు.

4 వేల మంది రిటైర్డు ఉద్యోగులకు నష్టం

గ్రాట్యుటీ పెంచుతున్నట్లు కేంద్ర సర్కార్​ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు జేబీసీసీఐ స్టాండర్డైజేషన్​ కమిటీ మీటింగ్​లో అగ్రిమెంట్​ కుదిరింది. దీని ప్రకారం సింగరేణిలో రిటైర్డు ఉద్యోగులకు పెరిగిన గ్రూట్యుటీని చెల్లించాల్సి ఉంది. 2017 జనవరి నుంచి 2018 మార్చి వరకు దాదాపు 4వేల మంది రిటైర్ అయ్యారు. ఉద్యోగ విరమణ సమయంలో రూ.10లక్షల  గ్రాట్యుటీ మాత్రమే తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.20లక్షల గ్రాట్యుటీ వారికి వర్తింపజేయలేదు. పెంచిన గ్రాట్యుటీ ప్రకారం రిటైర్డు అయిన ఉద్యోగులు రూ.10లక్షల చొప్పున అదనపు  ప్రయోజనం పొందాల్సి ఉంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తేదీ నుంచే గ్రాట్యుటీ పెంపు వర్తింపజేస్తే కార్మికులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సమావేశంలో ఈ డిమాండ్లను కార్మిక సంఘాలు వినిపించేందుకు రెడీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ

Latest Updates