పైసలు మిగిలినా కొత్త పెన్షన్లు ఇస్తలే

ఏడాదిలో 1,16,534 ఆసరా పింఛన్లు రద్దు

లబ్ధిదారులు చనిపోవడంతో పేర్లు తొలగింపు

వారి ప్లేస్​లోనూ కొత్త వారిని చేర్చని సర్కారు

1.20 లక్షల మందిని అర్హులుగా గుర్తించినా.. పెన్షన్ ఇస్తలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య ఒక్క ఏడాదిలోనే 1.16 లక్షలు తగ్గింది. పింఛన్ తీసుకుంటూ అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అయితే అలా తొలగించిన వారి ప్లేస్​లో కొత్తగా లబ్ధిదారులను చేర్చలేదు. బడ్జెట్ మిగిలినా కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన సుమారు లక్షా 20 వేల మందికి పెన్షన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

బడ్జెట్ మిగిలినా కొత్త పింఛన్ ఇస్తలే

2018 డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు ఆగిపోయింది. అప్పటి నుంచి చాలా మంది పేదల వయసు 65 ఏండ్లు దాటింది. చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, వితంతువుల కేటగిరీల్లోనూ చాలా మంది ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 3 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి లక్షా 20 వేల మందిని అర్హులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో చనిపోయిన పెన్షన్ దారులకు సంబంధించిన బడ్జెట్​ను కేటాయించినా.. కొత్త వాళ్లందరికి పెన్షన్ మంజూరు చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

నెలకు 5 వేల పేర్లు తొలగింపు

2019 డిసెంబర్​లో రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెన్షనర్ల సంఖ్య 39,14,194 ఉండగా, 2020 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 37,97,660కు చేరింది. ఒక్క ఏడాదిలోనే 1,16,534 పేర్లను ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 2019 డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్​లో 52,082 మంది పేర్లను ఓకేసారి తీసేసింది. తర్వాత పంచాయతీ కార్యదర్శులు ఇచ్చిన మృతుల సమాచారం మేరకు నెలకు సగటున 5 వేల పేర్లను డిలీట్ చేసింది. మొత్తంగా ప్రతి నెల సుమారు రూ.30 కోట్ల ఆసరా నిధులు మిగిలిపోతున్నాయి.

2 నెలలుగా పింఛన్ ఇస్తలేరు

రెండు నెలలుగా పింఛన్​డబ్బులు ఇస్తలేరని దివ్యాంగులు, వృద్ధులు జవహర్​నగర్​మున్సిపల్​కార్పొరేషన్​ఆఫీసు ముందు శుక్రవారం ఆందోళనకు దిగారు. పోస్ట్​ఆఫీస్ ​సిబ్బందిని అధికారులను అడిగితే సరైనా సమాధానం చెప్పడం లేదు.  కార్పొరేషన్ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోవడం లేదని బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల నాయకుడు దుర్గాప్రసాద్​ మాట్లాడుతూ పింఛన్ దారులకు ప్రతి నెల మొదటివారంలో పింఛన్​ ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బ్యాంకు ద్వారా పింఛన్ ఇచ్చేలా అధికారులు చొరవ చూపాలన్నారు.

For More News..

టెండరే రాలేదు.. పనులు మొదలెట్టిన్రు

నాలుగేండ్లలో 5 వేల యాక్సిడెంట్లు

ఈ ఏడాది 20 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు

Latest Updates