ఫీజుల పెంపు నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల ఫీజు పెంపులో ప్రభుత్వ సహకారం ఉందని, ఏటా పెంపుతో కోట్ల రూపాయల స్కామ్ జరగుతోందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే టీఎఫ్ఆర్సీ సహా విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం బీసీ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐటీ, వాసవి, మాతృశ్రీతోపాటు 30 కాలేజీలకు వేల కోట్ల విలువైన భూములున్నాయని,1980లో స్వచ్ఛంద సేవ పేరుతో సర్కారు నామమాత్రపు ధరకే భూములిచ్చిందని గుర్తు చేశారు. ఈ కాలేజీల్లో తక్కువ ఫీజులు ఉండాలని 3 లక్షల వరకు పెంచడం శిక్షార్హమన్నారు. ప్రభుత్వం, కోర్టులు ఆ ఫీజులను అంగీకరిస్తే, కాలేజీలకు తక్కువ ధరకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫార్సులను మించి కూడా ఫీజులు పెంచినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. 12 వేల మందికి గురుకులాలు పెట్టి, 12 లక్షల మందిని కార్పొరేటీకరణ ద్వారా దోచుకోవడానికి అనుమతించే ఇటువంటి విద్యా విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Latest Updates