- ఇన్‌టైమ్‌లో ఆపరేషన్లు జరగాల్సిందే
- ఓటీ, ల్యాబ్స్, ప్రీ అనస్థటిక్ చెకప్
- విభాగాల టైమింగ్స్ లో మార్పు
- ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో ఆపరేషన్స్ ఆలస్యమవుతుండటంతో పాటు చాలా కేసులు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆపరేషన్ థియేటర్, ల్యాబ్‌లు, ప్రీ అనస్థెటిక్ చెక్అప్ విభాగాల హెచ్‌వోడీలతో మంగళవారం హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. నాగేందర్ ఆయన ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్స్, ప్రీ అనస్థటిక్ చెకప్ విభాగాల టైమింగ్స్ ను మారుస్తున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ, ఎలక్టివ్ కేసులకు సంబంధించి పలు సూచనలు చేశారు. మారిన
ప్రొటోకాల్ ప్రకారం ఆపరేషన్ థియేటర్ ఉదయం 9 గంటలకే ఓపెన్ అవుతుందన్నారు. సర్జరీలు ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఆపరేషన్ కేసులను పోస్ట్‌పోన్ చేయకుండా నివారించేందుకు సంబంధిత విభాగాలు ప్రీ అనస్థెటిక్ సూచనలను పాటించాలన్నారు. ల్యాబోలేటరీ డిపార్ట్ మెంట్ పనిగంటలను పొడిగించి సాయంత్రం 4 గంటల లోపు రిపోర్ట్స్ ఇవ్వాలని సూచించారు. కేసుల వాయిదాను నిరోధించడానికి 2డీ ఎకో, ఫిట్నెస్ లను ఒకే సారి ఇవ్వాలన్నారు. సర్జరీ కేసులకు సంబంధించి పేషెంట్ ను సంబంధిత వార్డు ఇన్ చార్జి ఉదయం 8.30 గంటలకు ఆపరేషన్ థియేటర్ కు తరలించాలన్నారు. ఇన్ చార్జితో పాటు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు ఉండాలన్నారు. ఆపరేషన్ పూర్తయ్యాక వెంటనే పేషెంట్ ను పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు మార్చాలన్నారు. సర్జరీలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే, షెడ్యూల్ చేసిన జాబితా ప్రకారం కేసులను తీసుకోవాలని సంబంధిత హెచ్వోడీలకు సూపరింటెండెంట్ నాగేందర్ సూచించారు. ఏదైనా సర్జరీ కేసును వాయిదా వేయాల్సి వస్తే అందుకు కారణాలను ట్రీట్ మెంట్ చేస్తోన్న డాక్టర్ కేస్ షీట్ లో నమోదు చేయాలన్నారు. మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్ లో ఒకదాన్ని జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ కోసం ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. ల్యాబ్ ఇన్ చార్జిలు ప్రతి రోజు ల్యాబ్‌లను తనిఖీ చేయడంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ అందేలా చూడాలన్నారు. ప్రతి రోజు రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు.