కొవాగ్జిన్ టీకా.. గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవద్దు

 • ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసిన భారత్ బయోటెక్
 • వేరే జబ్బులున్నా వేసుకోవద్దని సూచన

హైదరాబాద్, వెలుగు: భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉండడం, పూర్తవకుండానే ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులివ్వడంపై విమర్శలు వస్తుండడంతో కంపెనీ స్పందించింది. కొవాగ్జిన్ ఎవరు వాడాలి? ఎవరు వాడొద్దు? టీకాను దేనితో తయారు చేశారు? దాని వల్ల కలిగే లాభనష్టాలేంటి?.. వంటి వివరాలతో మంగళవారం ఓ ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేసింది. 4 వారాల తేడాతో రెండు డోసుల కొవాగ్జిన్ వేసుకుంటే మంచి ఫలితాలు వచ్చినట్టు ఫేజ్1, ఫేజ్2 ట్రయల్స్‌లో తేలిందని అందులో పేర్కొంది.

రెస్ట్రిక్టెడ్ వాడకం అంటే..

ప్రస్తుతం కొవాగ్జిన్ కు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అందులోనూ పరిమిత (రెస్ట్రిక్టెడ్) వాడకానికే కొవాగ్జిన్‌కు అనుమతి ఉంది. అంటే మూడో దశ ప్రయోగాలు జరుగుతుండడంతో.. క్లినికల్ ట్రయల్ మోడ్‌లోనే ప్రాధాన్య వర్గాలకే వ్యాక్సిన్‌ను వేస్తారు. ఈ క్రమంలో ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ప్రభుత్వ హెల్త్ ప్రోగ్రామ్ కింద మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తారు.

ఇదీ కొవాగ్జిన్ ఫార్ములా

ఈ టీకాలో ప్రధానమైన ఫార్ములా జీవం లేని సార్స్‌కొవ్2 యాంటీజెన్(స్ట్రెయిన్ఎన్ఐవీ–2020–770). 6 మైక్రోగ్రాముల మేర ఉంటుంది. దాంతో పాటు 250 మైక్రోగ్రాముల ఇనాక్టివ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్, 15 మైక్రోగ్రాముల ఇమిడజోక్వినోలినోన్, 2.5 మిల్లీగ్రాముల 2 ఫినాక్సీ ఇథనాల్, 0.5 మిల్లీలీటర్ల ఫాస్ఫేట్ బఫర్ సెలైన్.

సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు.. రాకపోవచ్చు

సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు లేదా రాకపోవచ్చని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. వాటి గురించి తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని పేర్కొంది. టీకా వల్ల కరోనా సోకదని చెప్పింది. రెండో డోసు వ్యాక్సిన్ వేసుకున్నాక 3 నెలల పాటు ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తామంది.

వ్యాక్సిన్ వీళ్లకు వెయ్యరు

 • గర్భిణులు పాలిచ్చే తల్లులు అలర్జీలు ఉన్నవాళ్లకు
 • జ్వరం వచ్చినోళ్లకు
 • బ్లీడింగ్ సమస్య ఉన్నోళ్లకు
 • రక్తాన్ని పలుచన చేసే మందులు వాడే వారికి
 • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నోళ్లకు
 • ఇమ్యూన్ సిస్టమ్‌ను ప్రభావితం చేసే మందులు వాడేవారికి
 • వేరే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు
 • ఇతర తీవ్రమైన జబ్బులు ఉన్న వారికి

ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాన్స్

 • వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి, వాపు, చర్మం ఎర్రగా మారడం, దురద
 • చెయ్యి పై భాగం మొద్దుబారిపోవడం
 • వ్యాక్సిన్ వేసుకున్న చెయ్యి బలహీనమవడం
 • ఒంటి నొప్పులు
 • తలనొప్పి
 • జ్వరం
 • నలతగా అనిపించడం
 • దద్దుర్లు వాంతి వచ్చినట్టు అనిపించడం, వాంతులు

సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్

 • ఊపిరితీసుకోలేకపోవడం
 • మొహం, గొంతు వాపు
 • గుండె కొట్టుకునే వేగం పెరగడం
 • ఒళ్లంతా దద్దుర్లు
 • మత్తుగా ఉండడం, నీరసం

Latest Updates