రాజధాని భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తారా

ఆంధ్రప్రదేశ్ తుళ్లూరులోని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు. సోమవారం తుళ్లూరుకు చేరుకొని రాజధాని రైతుల ధర్నాలో పాల్గన్నారు. రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమన్నారు. ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని మహిళలు రోడ్డుపైకి వచ్చి పనులు వదిలి ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా రాజధానిపై ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్‌ విసిరారు.  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటున్న ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నా అన్నారు. రాజధాని భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తారా అని ప్రశ్నించారు. అవినీతి పేరు చెప్పి అమరావతిని చంపేయడం సరికాదన్నారు. కమిటీలతో కాదు.. హైకోర్టు జడ్జితో విచారణ జరపాలన్నారు.

జీఎన్‌ రావు కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్‌ పేపర్‌ లీక్‌ చేశారని ఆరోపించారు చంద్రబాబు. అది జిఎన్‌ రావు నివేదిక కాదు.. జగన్మోహన్‌ రెడ్డి నివేదిక అన్నారు. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవని, మంత్రులను ఒకచోట, కార్యదర్శులను మరో చోట ఎలా పెడతారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయడానికే ల్యాండ్‌ పూలింగ్‌ ప్యాకేజీ ప్రకటించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు నిస్వార్థంగా 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. అమరావతి ఓ మహా నగరం అవుతుందని భావించామని.. అసెంబ్లీయో, హైకోర్టో ఉంటే అభివృద్ధి జరగదని, మౌలిక సదుపాయాలు కల్పిస్తే వచ్చే పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. డబ్బుల్లేవంటూ అమరావతి నుండి రాజధానిని తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని పై సీఎం జగన్‌ ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటున్నవాళ్లు జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Latest Updates