ఆడవాళ్ళకు అలాంటి వాడే భర్తగా కావాలంట..

తనతో ఏడు అడుగులు వేసేవాడు ఆరు అడుగులు ఉంటాడా? అని ఆలోచించేవాళ్లు తక్కువమందే ఉంటారేమో! కానీ, తమ కలల రాకుమారుడు సకల గుణ సంపన్నుడు కావాలని కోరుకోని అమ్మాయి ఉండదేమో! మరి అతడ్ని గుర్తించడం ఎలా? అమ్మాయిల మనస్తత్వం గురించి కవులు, రచయితలు ఎన్నో రకాలుగా వర్ణించి చెప్పారు. సైకాలజిస్టులు కూడా వాళ్ల మనస్తత్వాల గురించి వివరిస్తుంటారు. ఇలా చెప్పినవాళ్లలో మగవాళ్లే ఎక్కువ ఉంటారనడంలో సందేహం లేదు. అవి చదివిన అమ్మాయిలు అలాగే నడుచుకోవడం, అబ్బాయిలకూ అదే అర్థమవడం సహజంగానే జరిగిపోయింది. అయితే, మగవాళ్ల మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశాలు మాత్రం అమ్మాయిలకు చాలా తక్కువ. మరి అతడ్ని గుర్తించడం ఎలా?

మగవాడు మంచి భర్త అని విశ్లేషించడానికి ఎన్నో సందర్భాలు ఉపయోగపడుతుంటాయి. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అతను ఎలాంటి వాడన్నది పక్కనబెడితే ఆడవాళ్లు.. ఎక్కువగా తమ స్వభావంకన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని సైకాలజిస్టులు చెప్తారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడని ఎన్నో స్టడీల్లో తేలింది. కాబట్టి, తమ ముప్పావు జీవితాన్ని పంచుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి.

అండగా నిలబడేవాడు

ఈ కాలంలో చాలామంది ఆడవాళ్లు ఇండిపెండెంట్‌‌‌‌గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయినా సరే.. కొన్ని విషయాల్లో మాత్రం కచ్చితంగా భర్త అండగా ఉండాలని కోరుకుంటున్నారు. దీనివల్ల జీవితం సజావుగా ఉంటుందని అంటున్నరు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆదరించి పరిష్కారం చూపే దిశగా గైడ్‌‌చేసి ఒత్తిడిని తగ్గించేవాడిని, ఉద్యోగం నుంచి రాత్రిళ్ళు ఇంటికి చేరినా సరే తనకోసం చూడకుండా వంట సిద్ధం చేసే వ్యక్తినీ, ఖర్చుల విషయంలో బ్యాలెన్స్​డ్​గా ఉండేవాళ్లను కోరుకుంటున్నారు. ఇలా అన్నింటిలోనూ సహకారం అందించే వ్యక్తి దొరికితే జీవితం సంతోషంగా సాగిపోతుందని వాళ్ల అభిప్రాయం.

కలిసిమెలిసి ఉండేవాడు

గంభీరంగా ఉండే మగవాళ్లలో చాలామంది సాధారణంగా తమ ఎమోషన్స్‌‌ని అంత ఈజీగా బయటపడనీయరు.  తమ ఎమోషన్స్‌‌ గురించి అసలు ఎవరికీ చెప్పరు. కొందరేమో అన్ని విషయాల్లో ఓపెన్‌‌గా ఉంటారు. ఇప్పటితరం అమ్మాయిలు తమకు కాబోయే అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలియాలనుకుంటారు. ఒకవేళ ఏమైనా పాత రిలేషన్‌‌షిప్స్‌‌ ఉన్నా సరే.. వాటి గురించి కూడా చెప్పాలని కోరుకుంటారు. ఇలా ఉండడంవల్ల తమ మధ్య నమ్మకం, క్రెడిబిలిటీ పెరుగుతుందని వాళ్ల భావన. దాంతో తమ బంధం మరింత స్ట్రాంగ్‌‌గా మారుతుందని ఉద్దేశం. పక్కన లేకున్నాసరే ప్రతివిషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పే భర్త ఉంటే వారు లక్కీనే!

చెప్పేది వినేవాడు

చాలామంది అబ్బాయిలు… అమ్మాయి ఏం చెబుతున్నా వింటున్నట్టు నటిస్తుంటారు. నిజంగా మనసు పెట్టి వినేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఎదుటివాళ్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వినకపోవడం సహజంగా చాలామంది చేసేదే! అయితే అప్పుడప్పుడు ధ్యాస పెట్టకపోవటంలో అభ్యంతరం ఏం ఉండదు. కానీ ఎప్పుడూ చెప్పేది వినకపోవడం, నాకెందుకులే అని పట్టీపట్టనట్టుగా ఉంటే మాత్రం నొచ్చుకునే విషయమే. కాబోయే కలల రాకుమారుడు తన మాటలు వినేవాడై ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. తన ఫ్యామిలీకి, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలు వినడంలో ఇంట్రెస్ట్‌‌ చూపించని వ్యక్తిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారట!

అర్థం చేసుకునేవాడు

పార్ట్‌‌నర్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ, అవి ఎప్పటికప్పుడు సమసిపోయేలా ఉండాలి. అసలు గొడవలే లేని భార్యభర్తలు ఉంటారు అంటే నమ్మబుద్ధి కాదు. ఎవరికి వాళ్లు తామే కరెక్ట్‌‌ అంటూ గొడవపడుతుంటారు. కానీ, పరిస్థితిని అంచనా వేసుకొని హెల్దీ ఆర్గ్యుమెంట్‌‌తో గొడవ క్లోజ్‌‌ చేసేవాళ్లను ఎవరైనా ఇష్టపడతారు. గొడవలన్నీ ఫెయిర్‌‌గా కోపం, కక్ష పెట్టుకోకుండా ముగించాలన్నమాట.

ప్రభావితం చేసేవాడు

రిలేషన్‌‌షిప్‌‌ కలకాలం నిలిచి ఉండాలంటే ఇద్దరూ ఒకరినొకరు ప్రభావితం చేసుకోగలగాలి. నిరంతరం లవ్‌‌, కేరింగ్‌‌ చూపుతూ బాధ్యతలు పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే అబ్బాయి భర్తగా దొరికితే అదృష్టమే. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సాయపడుతూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో తోడుగా నిలిచే వ్యక్తి దొరికితే మిస్టర్‌‌‌‌ ఫర్‌‌‌‌ఫెక్ట్‌‌ దొరికినట్టే! ఇలా తమ జీవితాన్ని ప్రభావితం చేసి.. గోల్‌‌వైపు నడిపించే అబ్బాయి గురించే అమ్మాయిలు ఆలోచిస్తుంటారట.

లైఫ్‌‌ బ్యాలెన్స్ చేసేవాడు

చాలామంది ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌‌ని, పర్సనల్‌‌ లైఫ్‌‌ని బ్యాలెన్స్‌‌ చేసుకోలేక ఒత్తిడిలో గడుపుతుంటారు. గోల్స్ ఉండడం మంచిదే కానీ వాటిలో పడి ఫ్యామిలీ లైఫ్‌‌ని వదులుకుంటే అది పర్సనల్ లైఫ్‌‌ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రొఫెషన్ ఏదైనా సరే.. ఇరవైనాలుగు గంటలూ ప్రొఫెషన్‌‌ గురించే ఆలోచిస్తూ, ఆఫీసులోనే గడిపే భర్త రాకూడదనే అనుకుంటారు. పర్సనల్‌‌ లైఫ్‌‌ని, ప్రొఫెషనల్‌‌ లైఫ్‌‌ని బాలెన్స్‌‌ చేసేవాళ్లని ఇష్టపడతారు. ఇలాంటి వాళ్లే ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Latest Updates