డాక్టర్ల నిరసన : రిటైర్మెంట్ ​వయసు పెంచితే ఊరుకోం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మెడికల్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంపు ప్రతిపాదనపై మెడికల్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు, జూనియర్​ డాక్టర్లు భగ్గుమన్నారు. మంగళవారం ధర్నాలు, దీక్షలు, విధుల బహిష్కరణతో తమ నిరసన తెలిపారు. ప్రతిపాదనను తాము సహించేది లేదని, రిటైర్మెంట్​ వయసు పెంచితే సహించేది లేదని తేల్చిచెప్పారు. కొందరు కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, పదవీ విరమణ వయసు పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నమెంట్​ డాక్టర్స్​ అసోసియేషన్​ (టీజీడీఏ) పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్లు, డాక్టర్లు హైదరాబాద్‌‌‌‌ కోఠిలోని డైరెక్టరేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మెడికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ ఆఫీస్​ను ముట్టడించారు. డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డి చాంబర్‌‌‌‌‌‌‌‌లో బైఠాయించి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నెలాఖరున రిటైర్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన రమేశ్‌‌‌‌రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి వయసు పెంపును ముందుకు తోస్తున్నారని, దానితో తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. నిరసనకారులను అరెస్ట్‌‌‌‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 2 గంటల పాటు నిరసన కొనసాగింది. టీజీడీఏ ప్రెసిడెంట్, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ పల్లం ప్రవీణ్‌‌‌‌ మాట్లాడుతూ వయసు పెంపు కంటే ముందు కెరీర్ అడ్వాన్స్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌(సీఏఎస్​)ను అమలుచేయాలని, టైమ్​ బాండ్​ ప్రమోషన్స్​ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సీఏఎస్‌‌‌‌ను అమలు చేయకుండా డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, సీఏఎస్ అమలుచేస్తే ప్రొఫెసర్ల కొరత ఉండదన్నారు. తన పదవిని కాపాడుకోవడానికి రమేశ్‌‌‌‌రెడ్డి సీఏఎస్‌‌‌‌ను పక్కనబెట్టి, వయసు పెంపు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇదే రమేశ్‌‌‌‌రెడ్డి ప్రొఫెసర్ల వయసు పెంపుపై 2018లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యతిరేకించారని తెలిపారు. ఇప్పటికే అసిస్టెంట్‌‌‌‌, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా పదేండ్లకుపైగా పనిచేశామని, ఇప్పుడు ప్రొఫెసర్లకు ఏడేండ్లు వయసు పెంచితే మరో ఏడేండ్లు తాము అసోసియేట్లుగానే ఉండిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఏఎస్‌‌‌‌ను ఇస్తే విరమణ వయసు ఎంత పెంచినా అభ్యంతరంలేదని అసోసియేట్‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ నరహరి అన్నారు.

విధులు బహిష్కరించిన జూడాలు

మెడికల్​ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ జూనియర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌ విధులను బహిష్కరించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ సహా ప్రభుత్వ టీచింగ్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌లో నిరసనలకు దిగారు. ప్రతిపాదనను వెనక్కి తీసుకునే వరకూ విధులకు హాజరుకాబోమని జూడా అసోసియేషన్ చైర్మన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ విజయేందర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. టీచింగ్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌లో ఖాళీగా ఉన్న 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు.

ధర్నాచౌక్​లో నిరుద్యోగ డాక్టర్ల సభ

ఇదే అంశంపై హెల్త్‌‌‌‌ రిఫార్మ్స్‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌  ఇందిరాపార్కు ధర్నాచౌక్‌‌‌‌ వద్ద నిరుద్యోగ డాక్టర్ల సభ నిర్వహించింది. హెచ్‌‌‌‌ఆర్డీఏ ప్రెసిడెంట్‌‌‌‌, డాక్టర్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌, నిమ్స్‌‌‌‌ రెసిడెంట్‌‌‌‌ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌ కన్వీనర్, డాక్టర్‌‌‌‌‌‌‌‌ జి.శ్రీనివాస్‌‌‌‌ తదితరులు రోజంతా నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని, పోస్టుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైన డిపార్ట్‌‌‌‌మెంట్లలో ప్రొఫెసర్లను ఒప్పంద పద్ధతిలో తీసుకోవాలని సూచించారు.

Latest Updates