రోజూ చేసే పనులే వెన్నునొప్పికి కారణాలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన భాగంగా వెన్నెముకును చెప్పొచ్చు. వెన్నెముకకు చిన్నపాటి గాయమైనా ప్రాణం విలవిల్లాడుతుంది. అలాగే రోజువారీ పనులపైనా ఈ ప్రభావం కనిపిస్తుంది. అయితే, వెన్నెముక సమస్యలను వెంటనే గుర్తించడం కష్టమే. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత తగ్గించడం అంత సులువు కాదు. అందుకే, మొదటి నుంచి జాగ్రత్తగా వ్యవహరిస్తే వెన్నెముక సమస్యలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది.

మనం ప్రతి రోజూ చేసే పనులే మన వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ఆ పనులే మెళ్లిమెళ్లిగా వెన్నును కుంగదీస్తాయి. బరువులు ఎత్తుడంతోపాటు వ్యాయామాలు చేయడమూ వెన్నుముకపై భారాన్ని పెంచుతాయి. ఈ నేపథ్యంలో రోజువారీ పనుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.

ఎక్కువగా ఫోన్ వాడుతున్నారా? : మొబైల్ ఫోన్ వినియోగం వెన్నెముకపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎక్కువ సేపు తలను ఒకవైపే ఆన్చడం, మెడను పక్కకు వాల్చి ఫోన్ మాట్లాడటం, అతిగా గేమ్స్ ఆడటం వంటివి వెన్నుకు భారంగా మారతాయి. అందుకే ఫోన్‌ వాడకాన్ని తగ్గించండి. ముఖ్యంగా పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచండి. మొబైల్‌‌తో ఎక్కువ సేపు గడిపితే భవిష్యత్తులో మెడ, వెన్నెముక సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

హై హీల్స్‌‌ వేసుకుంటున్నారా?: మహిళలు ఎక్కువగా హైహీల్స్ ధరించి నడవడానికి ఇష్టపడతారు. కానీ హైహీల్స్ వేసుకోవడం మంచిది కాదు. చాలా ప్రమాదకరం కూడా.. ఎక్కువ సేపు హైహీల్స్‌పై నడిచేవారికి వెన్ను అమరిక అదుపు తప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో వెన్ను సమస్యలు తలెత్తుతాయి. హైహీల్స్‌కు బదులు ఫ్లాట్ చెప్పులు ధరించడమే మంచిది. మామూలు ఎత్తు ఉండే చెప్పులు వేసుకున్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు.

అధిక బరువులు ఎత్తొచ్చా?: రోజూవారీ కార్యక్రమాల్లో భాగంగా ఒక్కోసారి అధిక బరువులు ఎత్తాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంచులు, సూట్‌కేసులు మోస్తున్నప్పుడు ఒక చేత్తో పక్కకి వాలిపోవడం సహజమే. దీని వల్ల వెన్నెముక సమస్యకు దారితీయొచ్చు. వ్యాయమాలు చేసేప్పుడు కూడా ఇష్టానుసారంగా బరువులు ఎత్తొద్దు. ట్రైనర్ సూచనల మేరకే బరువులు ఎత్తాలి. పిల్లల స్కూల్ బ్యాగ్గులు సైతం ఎక్కువ బరువు ఉండకుండా చూసుకోవాలి. పిల్లల శరీర బరువులో 20 శాతం కంటే ఎక్కువ బరువు మోయకూడదు.

ఎలా నిద్రపోతున్నారు?: నిద్రలో పడుకొనే భంగిక సక్రమంగా ఉంటే వెన్నెముకకు సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే వెన్నెముక అదుపుతప్పుతుంది. పడుకొనే భంగిమ సక్రమంగా లేకపోతే వెన్నెముకపై అదనపు ఒత్తిడి పెరిగి మెడ నొప్పి వస్తుంది. తలగడ ఎత్తు కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. ఎత్తైన తలగడ కాకుండా తక్కువ ఎత్తుతో ఉండే దిండులను వాడటం మంచిది. వీలైతే మోకాళ్ల కింద ఒక తలగడ పెట్టుకుంటే శరీరానికి హాయిగా ఉంటుంది. ఇంటి పనులు చేసేటప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నుపై భారం పడకుండా పనులు చేయడాన్ని అలవర్చుకోవాలి.

ఎక్కువగా కూర్చుంటున్నారా?: కార్యాలయాల్లో ఎక్కువ సేపు కుర్చీలకు అతుక్కుని ఉండేవారికి కూడా వెన్నెముక సమస్య తప్పదు. తప్పుడు భంగిమలో కూర్చుంటే వెన్నుముక అదుపు తప్పుతుంది. తుంటిపై ఎక్కువ భారం పడుతుంది. ఈ సమస్య రాకూడదంటే.. ప్రతి అరగంటకు ఒకసారి తల, మెడను కిందికి, పైకి, కుడి-ఎడమలకు తిప్పుతూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చునేవారికి వారికి.. మెడ, వెనుక కండరాలు, వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. వెన్నుభాగం కుర్చీకి నిటారుగా ఉండాలి. పాదాలు నేలను తాకాలి. ప్రతి అరగంటకు ఒకసారి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చాలా మంచిది.

పోషకాహరం తీసుకోండి: ఆహారపు అలవాట్లు బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కాల్షియం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, అవకాడో వంటివి వెన్నుకు చాలా మేలు చేస్తాయి.

ఈ లక్షణాలతో బాధపడుతున్నారా?: నడిచేప్పుడు ఇబ్బందిగా ఉండటం, మూత్ర విసర్జన సమస్యలు, కాళ్లు, భుజాలు కదిపేందుకు ఇబ్బంది పడటం, తిమ్మిర్లు రావడం, స్పృహ కోల్పోవడం, తలనొప్పితోపాటు తీవ్రమైన మెడ నొప్పి లాంటితో బాధపడుతున్నారా? అయితే వెంటనే సంబంధింత డాక్టర్లను కలవాలి.

Latest Updates