జీన్స్ ధరించిందని భార్యపై దాడి, చనిపోయిందనుకొని పీఎస్ కు

జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించిందని భార్యపై విచక్షణా రహితంగా చేయిచేసుకున్నాడో వ్యక్తి. దాడి తర్వాత ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో, చనిపోయిందని భావించిన సదరు వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉండగా.. అతని భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన  మహారాష్ట్రలోని డొంబివ్లీ అనే నగరంలో జరిగింది.

డొంబివ్లీ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హౌస్ కీపర్ గా పని చేసేవాడు సుధీర్(32). అతని భార్య సుజాత ఓ షాపింగ్ మాల్ లో పనిచేసేది. అయితే ఈ నెల 11 న(బుధవారం) సుజాత తన పని ముగించుకొనే ఇంటికి వచ్చే సమయంలో జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించి ఉండటం సుధీర్ గమనించాడు. ఆ బట్టలు వేసుకున్నందుకు ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిన క్రమంలో అతను ఆమెపై చేయి చేసుకోవడంతో స్పృహ తప్పి పడిపోయింది. ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో  తన భార్యను తన చేతులారే చంపేశానని భావించి పోలీసులకు లొంగిపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన ఘటన గురించి ఎంక్వయిరీ చేసిన ఇన్స్ పెక్టర్ సురేష్ అహెర్ కు సుజాత ప్రాణాలతో ఉందని ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిసింది. ప్రస్తుతం సుధీర్ పోలీస్ స్టేషన్ లో, అతని భార్య సుజాత హాస్పిటల్ లో ఉన్నారు.

Latest Updates