కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..పతనమైన ఆయిల్ ధరలు

కరోనాతో అంతర్జాతీయ  మార్కెట్లు కుప్పకూలాయి. ఆసియా మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 14 వందల పాయింట్లు, నిఫ్టీ 3 వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు సాదీ  అరేబియాలో ఆయిల్ రేట్లు 30 శాతం వరకు తగ్గిపోయాయి. దీని ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లపై పడింది.

రష్యాతో చమురు యుద్ధం మొదలు పెట్టింది సౌదీ అరేబియా. గత 29 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా క్రూడాయిల్ ధరలు తగ్గించింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ పై 14.25 డాలర్లు తగ్గింది. శాతాలవారీగా చూస్తే 31.5 శాతం తగ్గి బ్యారెల్ ధర 31.02 డాలర్లకు చేరింది.  1991 లో గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. అదే సమయంలో WTI క్రూడ్ ధర 11.28 డాలర్లు తగ్గింది. 27.4 శాతం తగ్గి బ్యారెల్ ధర 30 డాలర్లకు చేరింది.

సౌదీ అరేబియాప్రపంచంలోనే అతిపెద్ద చమరు ఎగుమతిదారు. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా రష్యా ఉంది. రష్యాను తొక్కేసే ఉద్దేశంతోనే సౌదీ అరేబియా ఆయిల్ ధరలు తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ తగ్గింది. దీంతో ఒపెక్ దేశాలు, రష్యా మధ్య క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గింపుపై చర్చలు జరిగాయి. ఒపెక్ అయితే ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించింది. 2020 చివరి వరకు క్రూడాయిల్ ఉత్పత్తిని 1.5శాతం తగ్గించాలని ఒపెక్ నిర్ణయం తీసుకుంది. అయితే రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన రష్యా మాత్రం ఒపెక్ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన సమావేశంలో రష్యా, ఒపెక్ దేశాలు అవగాహనకు రాలేకపోయాయి. చమురు ఉత్పత్తి తగ్గించేందుకు సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు ఫలితాలనివ్వలేదు. దీంతో తక్కువ ధరకు ఎక్కువ క్రూడాయిల్ అమ్మి లాభపడాలని సౌదీ అరేబియా ప్లాన్ చేసింది. ఉత్పత్తిని భారీగా పెంచి ధరల విషయంలో పోరాటానికి సిద్ధమైంది సౌదీ. మరోవైపు క్రూడాయిల్ రవాణా విషయంలో రష్యా కంటే సౌదీకే మంచి సౌకర్యాలు ఉన్నాయి. దీంతో వేగంగా అడుగులు వేసిన సౌదీ అరేబియా… ధరలను తగ్గించేసింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా క్రూడాయిల్ ధరలు తగ్గిపోయాయి.

Latest Updates