రెండోసారి అభిశంసనకు గురైన ఏకైక ప్రెసిడెంట్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతినిధుల సభలో అభిశంసన (ఇంపీచ్ మెంట్) ఆర్టికల్ పై ఓటింగ్ కు రంగం సిద్ధమైంది. క్యాపిటల్ బిల్డింగ్ పై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టి, హింసకు కారణమైన ట్రంప్ ను 25వ రాజ్యాంగ సవరణను అమలు చేయడం ద్వారా పదవి నుంచి తొలగించాలంటూ ప్రతినిధుల సభ మంగళవారం రాత్రి తీర్మానాన్ని పాస్ చేసింది. అయితే 25వ రాజ్యాంగ సవరణను అమలు చేయడానికి వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తిరస్కరించారు. దీంతో ట్రంప్ పై ఇంపీచ్​మెంట్ ఆర్టికల్​ను ప్రయోగించేందుకు ప్రతినిధుల సభ బుధవారం ఓటింగ్ కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్ పై ఇంపీచ్ మెంట్ ప్రాసెస్ స్టార్ట్ కావడం ఇది రెండోసారి. దీంతో రెండుసార్లు ఇంపీచ్ మెంట్ ను ఎదుర్కొన్న ఏకైక ప్రెసిడెంట్ గా ట్రంప్ నిలిచారు.

ఇది పనిష్మెంట్ కు ఉద్దేశించినది కాదు: పెన్స్  

“25వ రాజ్యాంగ సవరణ పనిష్మెంట్ కు ఉద్దేశించినది కాదు. ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి పదవిని నిర్వహించే కెపాసిటీని కోల్పోయినప్పుడు లేదా డిజేబిలిటీకి గురైనప్పుడు సమస్య పరిష్కారానికి సంబంధించినది. ఇలాంటి పద్ధతిలో 25వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తే.. భవిష్యత్తులో ఇది భయంకర పరిణామాలకు నాంది పలుకుతుంది” అని పెన్స్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ ను తొలగించాలంటూ పెలోసీ లేఖ రాయగా, ఆయన తిరస్కరించారు. దీంతో అధికారికంగా తీర్మానం చేస్తూ వైస్ ప్రెసిడెంట్ ను కోరడం కోసం ప్రతినిధుల సభలో మంగళవారం రాత్రి ఓటింగ్ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు, వ్యతిరేకంగా 205 ఓట్లు పడ్డాయి.

ఇంపీచ్ మెంట్ ఆర్టికల్ పై ఓటింగ్..

జనవరి 6న వాషింగ్టన్ లోని క్యాపిటల్ బిల్డింగ్ పై దాడికి పాల్పడేలా ట్రంప్ రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చారని, ఆయన తిరుగుబాటును ప్రేరేపించారని ఆరోపిస్తూ డెమొక్రాట్ లీడర్లు ప్రతినిధుల సభలో ఇంపీచ్ మెంట్ ఆర్టికల్ ను ప్రవేశపెట్టారు. ఇంపీచ్ మెంట్ ఆర్టికల్‌‌‌‌ కు నలుగురు రిపబ్లికన్ ప్రతినిధులు కూడా మద్దతు తెలిపారు. దీనిపై బుధవారం ఓటింగ్ జరగనుంది. అయితే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్నందున ఇంపీచ్ మెంట్ ఆర్టికల్ పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతినిధుల సభలో నెంబర్ 3 రిపబ్లికన్ లీడర్ అయిన లిజ్ చెనెయ్, ఇతర మెంబర్లు జాన్ కట్కో, ఆడమ్ కిన్జింజర్, ఫ్రెడ్ అప్టన్ కూడా ఇంపీచ్ మెంట్ ఆర్టికల్ కు మద్దతుగా ఓటేస్తామన్నారు. కానీ సెనేట్ లో రిపబ్లికన్లకే మెజారిటీ ఉంది. ప్రతినిధుల సభ పాస్ చేసే ఆర్టికల్ పై సెనేట్ లో ట్రయల్ జరిగి ట్రంప్ దోషిగా తేలితేనే ఆయన ఇంపీచ్ మెంట్ కు అవకాశం ఉంటుంది. అయితే జనవరి 20న ట్రంప్ పదవీకాలం ముగిసి, కొత్త ప్రెసిడెంట్ గా బైడెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొద్దిరోజుల్లోనే ఇంపీచ్ మెంట్ ప్రాసెస్ మొత్తం ముగిసి, ట్రంప్ దోషిగా తేలే అవకాశాలు దాదాపుగా లేవని చెప్తున్నారు.

సెనేట్‌లో కష్టమే

సెనేట్ లో రెండింట మూడొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే ట్రంప్ పై ఇంపీచ్ మెంట్ ఆర్టికల్ పాస్ అవుతుంది. వంద మంది సభ్యులున్న సెనేట్ లో ఆర్టికల్ పాస్ అవ్వాలంటే రిపబ్లికన్ పార్టీ నుంచి17 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే సెనేట్ లో ట్రంప్ ను దోషిగా తేల్చడం సాధ్యం కాదని చెప్తున్నారు. పైగా సెనేట్ లో ట్రయల్ జనవరి 19న సమావేశాలు తిరిగి మొదలయ్యాకే ప్రారంభమవుతుంది. అయితే, ట్రంప్ భవిష్యత్తులో మళ్లీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేందుకు కూడా డెమొక్రాట్లు మరో ఇంపీచ్‌మెంట్ ట్రయల్‌ను సెనేట్ కు పంపనున్నారు. దీనికి రెండింట మూడొంతుల మెజారిటీ కాకుండా, సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. కానీ డిస్ క్వాలిఫికేషన్ పై ఓటింగ్ జరగడానికి ముందు ఇంపీచ్‌మెంట్ ట్రయల్‌లో ట్రంప్ దోషిగా తేలాల్సి ఉంటుందని కొందరు, అవసరం లేదని మరికొందరు నిపుణులు చెప్తున్నారు.

Latest Updates