ట్రంప్ వస్తున్నడు.. పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఖాళీ చేయండి

24న తాజ్ మహల్‌కి పర్యాటకులకు నో ఎంట్రీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న పర్యటనకు నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అడుగడుగునా డేగ కళ్లతో నిఘా.. ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఆయన వచ్చిన రోజున ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వెళ్లే రూట్‌లో ఉన్న పెట్రోల్ బంకుల్లో స్టాక్ మొత్తం ఖాళీ చేయాలని యజమానులను పోలీసులు ఆదేశించారు. అలాగే ఆ రోజున పర్యాటకులను తాజ్ మహల్ దగ్గరకు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఆయన అక్కడికి వెళ్తారు. అయితే ట్రంప్ భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్తగా 12 గంటల నుంచే అక్కడికి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రోహాన్ ప్రమోద్ తెలిపారు. తాజ్ మహల్ సందర్శనకు ట్రంప్ వెంట ఆయన భార్య మెలనియా ట్రంప్, కుమార్తె ఇవాంక కూడా వస్తున్నారు.

తాజ్ దగ్గరకు వెళ్లే రూట్ అంతా..

భద్రత ఏర్పాట్లలో భాగంగా ట్రంప్ తాజ్ మహల్ దగ్గరకు వెళ్లే రూట్ అంతా పోలీసులు తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ఆయన కారు వెళ్లే దారిలోని అన్ని ఇళ్లు, షాపులు, హోటళ్లను ఇప్పటికే తనిఖీ చేశారు. షాపు యజమానులతో పాటూ ప్రతి ఇంటిలోనూ ఆధార్ కార్డులు అడిగి చెక్ చేశారు. సిటీలో ఆయన వెళ్లే రూట్‌లో మూడు పెట్రోల్ బంకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్ వచ్చే ముందు ఆయా బంకుల్లో ఆయిల్ పూర్తిగా ఖాళీ చేయాలని వాటి యజమానులను ఆదేశించారు.

Latest Updates