నౌహీరాకు బెయిల్‌ ఇవ్వొద్దు

చిన్న మొత్తాలకు భారీ వడ్డీలతో పెద్ద మొత్తాలను ఇస్తామని చెప్పి హీరా గోల్డ్‌ కంపెనీ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లోని వాళ్లనూ దారుణంగా మోసం చేసిందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. హీరా గోల్డ్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ నౌహీరా షేక్‌కు బెయిల్‌ ఇవ్వరాదని విన్నవించారు. బెయిల్‌ ఇస్తే ఆమె బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, సాక్షులను ప్రభావితం చేసేందుకు, ప్రలోభపెట్టేందుకు అవకాశం ఉందని, అందుకు ఆమెకు ఆర్థిక స్థోమత కూడా ఉందని అభ్యంతరం చెప్పారు. సిటీ సెంట్రల్​క్రైమ్​స్టేషన్ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.రామ్‌ కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.

అన్ని కేసుల్ని ఒకేచోటకు బదిలీ చేయొద్దు

అన్ని కేసుల్ని ఒకే చోటకు బదిలీ చేయాలని, బెయిల్‌ ఇవ్వాలన్న నౌహీరా అభ్యర్థనను తోసిపుచ్చాలని కౌంటర్​పిటిషన్ లో పోలీసులు కోరారు. ‘లక్షా72 వేల మంది నుంచి రూ.5,600 కోట్లను డిపాజిట్లుగా వసూళ్లకు పాల్పడింది. అనేక చోట్ల ఉన్న బాధితులున్నారు తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లల్లో కేసులు పెట్టే హక్కు ఉంది. వీటన్నింటినీ డిపాజిట్లు చెల్లించని నౌహీరా సౌలభ్యం కోసం ఒకే పీఎస్‌లో కేసుగానో, అన్ని కేసుల్ని ఒకటిగానో పరిగణించాలని ఆమె కోరడం చట్ట వ్యతిరేకం. 2013 కంపెనీస్‌ యాక్ట్‌లోని 212(2) సెక్షన్‌ ప్రకారం భారీ నగదు లావాదేవీలున్న కేసుల్లో పోలీసులు తమకు తాము నిర్ణయం తీసుకుని చేసే అధికారం లేదు. ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్ ​డిపాజిటర్స్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999ను 2003లో సవరించారు. చట్టానికి లోబడే సీసీఎస్‌ కేసుల్ని దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌ 27న రోహిత్‌ రవీంద్రనాథ్‌–కబీర్‌ షిరాజ్‌ ఇతరుల మధ్య దాఖలైన కేసులో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా హీరాగోల్డ్‌ కంపెనీ ఎండీ వాదన ఉంది. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోరాదు” అని కౌంటర్‌ పిటిషన్‌లో సీసీఎస్‌ పోలీసులు హైకోర్టుకు నివేదించారు.

Latest Updates