షాపింగ్ చేసేముందు గుర్తించుకోవాల్సిన విషయాలు

ఈ రోజుల్లో షాపింగ్ అనేది కేవలం అవసరం మాత్రమే కాదు. అదొక సరదా కూడా. చాలామంది ఏమీ తోచకపోతే ‘అలా షాపింగ్‌‌కి వెళ్లొద్ధాం’ అనుకుంటారు. టైంపాస్ కోసం షాపింగ్‌‌కు వెళ్లి, తెలియకుండానే ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. షాపింగ్ చేసేటప్పుడు చాలామంది కామన్‌ గా
చేసే మిస్టేక్స్ ఏంటంటే..పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ కు వెళ్లినప్పుడు అక్కడుండే వస్తువుల్ని లేదా బట్టల్ని చూసి అట్రాక్ట్ అయ్యి, అవసరం లేకపోయినా ఏవేవో కొనడం, ఏదో కొనాలని వెళ్లి అనుకున్న వస్తువు కాకుండా మరొకటి కొనడం చేస్తుంటారు చాలామంది. తీరా షాపింగ్ పూర్తయ్యాక బిల్లు చూసి డీలా పడుతుంటారు. అందుకే షాపింగ్ చేసేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

అవసరం ఉంటేనే

షాపింగ్ చేయాలనుకున్నప్పుడు నిజంగా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉందో, లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ నిజంగా చేయాల్సివస్తే ఏమేమి కొనాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏమేమి కొనాలనుకుంటున్నారో పూర్తి అవగాహనతో షాపింగ్‌ కు వెళ్లాలి. షాపింగ్‌ కి వెళ్లినప్పుడు ముందుగా రాసుకున్న లిస్ట్‌‌లో ఉన్నవి తప్ప ఇంకేమీ కొనకుండా జాగ్రత్త పడాలి.

జాగ్రత్తగా వినాలి

షాపింగ్ చేయడానికి మాల్స్‌ కి వెళ్లినప్పుడు అక్కడుండే సేల్స్ వాళ్లు చెప్పే మాటలు విని అవసరం లేనివి కొనేస్తుంటారు కొంతమంది. అందుకే కొనాలనుకుంటున్న వస్తువుపై సరైన అవగాహనతో షాపింగ్‌ కు వెళ్లాలి. ఆఫర్‌‌ ఉందనో, ఒకేసారి ఎక్కువ కొంటే డిస్కౌంట్ లభిస్తుందనో ఆ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలియకుండా కొనకూడదు. ఒక్కోసారి కొత్త కొత్త టెక్నాలజీల గురించి కూడా సేల్స్ సిబ్బంది వివరిస్తుంటారు. వాటి గురించి పూర్తిగా విని, మనకు అవసరం అనుకుంటేనే వాటిని కొనాలి. అలాగే కొనే ముందు గ్యారెంటీ, వారెంటీ, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ లాంటి వాటి గురించి పూర్తిగా అన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలి.

డిస్కౌంట్ సేల్స్

పండుగలు, సీజన్లప్పుడే కాకుండా ప్రతీ రెండు నెలలకోసారి షాపింగ్ మాల్స్ డిస్కౌంట్స్ ప్రకటిస్తుంటాయి. షాపుల్లో స్టాక్ ఎక్కువగా ఉన్నప్పుడు నిల్వ ఉన్న సరుకు అమ్మేయడం కోసం కంపెనీలు అప్పుడప్పుడు అలా డిస్కౌంట్‌‌ సేల్స్ పెడుతుంటాయి. అలాంటి సేల్స్‌ లో కొనేముందు వస్తువు క్వాలిటీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. డిస్కౌంట్స్‌ లో ‘అప్ టు’, ‘ఫ్లాట్’ అనే రెండు రకాలుంటాయి. ‘ఫ్లాట్ 50’ అంటే పూర్తిగా 50 శాతం డిస్కౌంట్ అని అర్థం. అలా కాకుండా ‘అప్ టు 50’ అని ఉంటే ఒకటి నుంచి యాభై శాతం వరకు అని అర్థం. అది చూసుకోకుండా షాపింగ్‌  బయలుదేరితే.. తీరా అక్కడకు వెళ్లాక నిరాశ పడాల్సి వస్తుంది. అలాగే అప్పుడప్పుడు రోడ్ల వెంట పెద్దపెద్ద హాల్స్‌ లో డిస్కౌంట్ సేల్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి వెళ్లకపోవడమే మేలు. ఎందుకంటే.. అలాంటి చోట్ల ఏదైనా వస్తువు కొంటే.. తర్వాత ఏదైనా తేడా వస్తే తిరిగి అడగడానికి అక్కడ షాపు ఉండదు.

ఎక్స్‌‌చేంజ్ సేల్స్

షాపింగ్ చేసేటప్పుడు చాలామంది తప్పు చేసే మరో విషయం ఎక్స్ చేంజ్ సేల్స్. ఎక్స్ చేంజ్ సేల్స్‌ లో పాత వస్తువులు ఇచ్చి, కొత్త వస్తువు తీసుకెళ్తుంటారు. ఎక్సేం జ్ చేసే వాటిలో ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, మొబైల్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులే ఉంటాయి. ఇలా ఎక్సేంజ్‌‌లో ఏదైనా కొనేటప్పుడు పాత వస్తువుకు.. కొత్త వస్తువు ధరలో ఎంత తగ్గించారో చూసుకోవాలి. కొత్త వస్తువు క్వాలిటీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఆ వస్తువుకు వారెంటీ ఉందో లేదో కూడా చూసుకోవాలి.

ఆన్‌ లైన్ షాపింగ్‌ లో..

ఇకపోతే ఆన్‌ లైన్ షాపింగ్‌ లో కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు అవేంటంటే…ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కోసం చాలామంది ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ ఆప్షన్‌ ను ఎంచుకుంటారు. ఆన్‌ లైన్‌ లో షాపింగ్ చేసేటప్పుడు ‘క్యాష్ ఆన్ డెలివరీ’ కన్నా కార్డ్ పేమెంట్స్‌ తోనే ఎక్కువ లాభం ఉంటుంది. పేమెంట్‌‌కు క్రెడిట్‌‌ కార్డ్‌‌ ఉపయోగిస్తే.. మంచి ఆఫర్స్ ఉంటాయి. కార్డ్‌‌తో పేమెంట్ చేసిన ప్రతిసారీ కొన్ని పాయింట్లు కలుస్తుంటాయి. ఇవి తర్వాత మళ్లీ వేరే వస్తువులు కొనడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆన్‌ లైన్ యాప్స్‌ లో కాకుండా వెబ్‌ సైట్స్‌ లో షాపింగ్ చేసినట్లయితే.. అందులో
ఎంటర్ చేసిన క్రెడిట్ కార్డ్ డిటెయిల్స్‌ ను వెంటనే తొలగించాలి లేదా అకౌంట్‌‌ నుంచి లాగవుట్‌‌ అవ్వాలి. క్రెడిట్ కార్డ్‌‌ను ఎక్కడ వాడినా జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌ లైన్ షాపింగ్ కోసం పాపులర్ సైట్స్ లేదా యాప్స్‌ వాడాలే తప్ప అంతకుముందెప్పుడూ వినని కొత్త ఈ– పోర్టల్స్ జోలికి వెళ్లకూడదు.

నమ్మకమైన వెబ్‌ సైట్స్‌ లో మాత్రమే నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయి. ఫ్రిజ్‌‌, వాషింగ్‌ మిషన్‌ లాం టి ఎలక్ట్రా నిక్‌‌ వస్తువులను కొన్నప్పుడు వాటి వారెంటీ గురించి ఆరా తీయాలి. ఆన్‌ లైన్‌ లో వాటిని కొంటే వాటికి వారెంటీ వర్తిస్తుందో లేదో ముందే తెలుసుకుని ఆర్డర్‌‌ ఇవ్వాలి. ఆన్‌ లైన్ షాపింగ్ చేసేటప్పుడు యాప్స్ ఇచ్చే డిస్కౌంట్స్‌ తోపాటు, ఆన్‌ లైన్ పేమెంట్స్‌ లో కూడా కొన్ని బ్యాంకులు, పేమెంట్ యాప్స్ క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు ఇస్తుంటాయి. ఈ ఆఫర్లు బ్యాంకులు ఇస్తున్నాయా లేక ఆయా యాప్స్ ఇస్తున్నాయా అనేది పూర్తిగా తెలుసుకోవాలి. బిల్లు, ఇన్‌ వాయిస్‌‌లు లేకుండా వస్తువుల్ని కొనకూడదు.

Latest Updates