కరోనాకు ఎక్కడయినా ఒకటే వైద్యం.. కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో చేరి న‌ష్ట‌పోవ‌ద్దు

సిద్దిపేట: క‌రోనా ప‌ట్ల‌ నిర్లక్ష్యం వ‌హించొద్ద‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌టికి రావొద్ద‌ని అన్నారు. క‌రోనా పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే భయంతో వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి డబ్బును నష్టపోవద్దని, కరోనాకు ఎక్కడయినా ఒకటే వైద్యమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మంచి వైద్యం అందిస్తున్నారని మంత్రి చెప్పారు.

కరోనా నేపథ్యంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యవహరించ వద్దని, ఫంక్షన్ లు, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో త్వరలోనే కోవిడ్ టెస్టులు కూడా ప్రారంభిస్తామని, టెస్టుల అనంతరం ఇక్కడే వైద్యం కూడా అందిస్తామని చెప్పారు. కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Latest Updates