క‌రోనా సోకిన‌వాళ్ల‌ను పాపం చేసిన‌ట్లు చూడొద్దు

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటోందని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఢిల్లీ నిజాముద్దీన్ మ‌ర్క‌స్ స‌ద‌స్సుకు వెళ్లిన వారిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింద‌ని చెప్పారు. ఆ స‌మావేశానికి వెళ్లిన వాళ్లంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి టెస్టులు చేయించుకోవాల‌ని సూచించారు. అలాగే క‌రోవా వైర‌స్ సోకిన వాళ్ల‌ను ద్వేషించొద్ద‌ని, వాళ్లు ఏదో పాపం చేసిన‌ట్లుగా చూడొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. చుట్టుప‌క్క‌ల వాళ్లు వారికి అండ‌గా ఉండాల‌ని కోరారు.

87 మంది పేషెంట్ల‌లో 70 మందికి ఢిల్లీ స‌ద‌స్సుతో లింక్

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 87 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అందులో దాదాపు 70 మంది వ‌ర‌కు ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన వాళ్లు, వాళ్ల‌తో కాంటాక్ట్ అయిన వాళ్లేన‌ని చెప్పారు సీఎం జ‌గ‌న్. బుధ‌వారం సాయంత్రం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణపై స‌మీక్ష త‌ర్వాత సీఎం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. రెండ్రోజులుగా ఒక్క‌సారిగా క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింద‌ని, ఢిల్లీ మ‌ర్కజ్ స‌ద‌స్సులో విదేశీయులు పాల్గొన‌డంతో అక్క‌డికి వెళ్లి వ‌చ్చిన మ‌న‌వాళ్ల‌కు వైర‌స్ సోకింద‌ని చెప్పారు. ఈ స‌ద‌స్సుకు ఏపీ నుంచి 1080 మంది వెళ్లార‌ని, వారిలో ఇప్ప‌టికే 500 మందికి పైగా ప‌రీక్ష‌లు చేశామ‌ని తెలిపారు. మిగిలిన వారి టెస్టు రిపోర్ట్స్ రావాల్సి ఉంద‌న్నారు సీఎం జ‌గ‌న్. మ‌రో 21 మంది ఆచూకీ తెల‌య‌లేద‌ని, వారిని ట్రేస్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. ఆ స‌ద్సుకు వెళ్లి వ‌చ్చిన వాళ్లు ఎవ‌రైనా స‌రే స్వ‌చ్ఛందంగా వ‌చ్చి టెస్టులు చేయించుకోవాల‌ని కోరారు.

వేగంగా వ్యాపించ‌డ‌మే పెద్ద ప్ర‌మాదం

క‌రోనా వైర‌స్ గురించి ఎక్కువ‌గా భ‌య‌ప‌డొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు సీఎం జ‌గ‌న్. ఇది కూడా మామూలు ఫ్లూ, జ్వ‌రం లాంటిదేన‌ని, కాకుంటే ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా వ్యాపించ‌డ‌మే పెద్ద ప్ర‌మాద‌మ‌ని, దీనిని అందరూ గుర్తించాల‌ని కోరారు. ఈ వైర‌స్ సోకినా చికిత్స చేయించుకుంటే త‌గ్గిపోతుంద‌ని, అయితే 14 రోజుల పాటు ఎవ‌రినీ క‌ల‌వ‌కుండా ఐసోలేష‌న్ లో ఉండ‌డ‌మే ముఖ్య‌మ‌ని చెప్పారు.

Latest Updates