మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంచొద్దు

హైదరాబాద్, వెలుగు : మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటును పెంచకూడదని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) అంటోంది.  జీఎస్టీ రేట్లను పెంచే ఎలాంటి ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌‌ను ఐసీఈఏ కోరింది. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పెంపుతో మొబైల్ ఫోన్ల పెనట్రేషన్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని, డిజిటల్ ఇండియా కింద ప్రభుత్వం చేపడుతోన్న చాలా సర్వీసులు, కోర్ ప్రొగ్రామ్‌లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. జీఎస్టీ శ్లాబ్ 12 శాతాన్ని ప్రభుత్వం తీసేస్తోందని మీడియా రిపోర్ట్ లు వస్తున్నాయని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహింద్రో అన్నారు. దీంతో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. ఇది 2020లో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే వారిపై ప్రభావం చూపుతుందన్నారు. 2020లో 31 కోట్లకు పైన ప్రజలు ఫోన్లు కొందామనుకుంటున్నట్టు అంచనాలున్నాయి. తెలంగాణలో 97.5 లక్షల మందిపై ప్రభావం పడుతుందని పంకజ్ పేర్కొన్నారు. కేవలం హ్యాండ్‌సెట్లపైనే కాకుండా.. మొబైల్ ఫోన్లకు సంబంధించిన అన్ని కాంపోనెంట్స్, యాక్ససరీస్‌పై కూడా జీఎస్టీ రేటు 12 శాతాని కంటే ఎక్కువ ఉండకూడదని పేర్కొన్నారు.

Latest Updates