క‌రోనా టైమ్‌లో సేఫ్.. శాశ్వ‌తంగా భార‌త్‌లోనే ఉంటా: హైకోర్టులో అమెరిక‌న్ పిటిష‌న్

క‌రోనా లాక్‌డౌన్ టైమ్‌లో భార‌త్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు స్పెష‌ల్ ఫ్లైట్స్ వేసిన‌ప్పుడు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోతుంటే.. ఓ అమెరిక‌న్ మాత్రం తాను శాశ్వ‌తంగా ఇక్క‌డే ఉండిపోతానంటున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో భార‌త్‌‌కు వ‌చ్చిన అమెరికా టూరిస్ట్ జానీ పాల్ తాను తిరిగి వెళ్ల‌నంటూ కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. త‌న టూరిస్టు వీసాను బిజినెస్ వీసాగా మార్చేలా ప్ర‌భుత్వానికి ఆదేశాలివ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు బాగున్నాయ‌ని, ప్ర‌స్తుతం త‌న‌కు 74 ఏళ్ల వ‌య‌సు అని, తాను ఈ టైమ్‌లో అమెరికాకు వెళ్ల‌డం సేఫ్ కాద‌ని, కేర‌ళ‌లోనే ఉండి బిజినెస్ చేసుకుంటాన‌ని కోర్టుకు వివ‌రించాడు. వాస్త‌వానికి తానొక స‌న్యాసిన‌ని, లాక్‌డౌన్ స‌మ‌యంలో ధ్యానం చేసుకునేందుకు చాలా మంచి స‌మ‌యం దొరికింద‌ని చెప్పాడు పాల్. తాను భార‌త్ రావ‌డం ఇది ఐదోసార‌ని, క‌రోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఇక్క‌డ ఉండి ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డిపాన‌ని అన్నాడు. టూరిస్టు వీసాకు ఆరు నెలలు మాత్ర‌మే గ‌డువు ఉంటుంది, ఆగ‌స్టు 24తో త‌న వీసా ఎక్స్‌పైర్ అవుతుంద‌ని చెప్పారు. టూరిస్టు వీసాను బిజినెస్ వీసాగా మార్చుకునేందుకు మొద‌ట తాను అమెరికాకు వెళ్లాల్సి ఉంటుంద‌ని, అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితుల్లో 74 ఏళ్ల వ‌య‌సున్న తాను అమెరికాకు వెళ్ల‌డం అంత క్షేమం కాద‌ని పిటిష‌న్‌లో కోర్టుకు వివ‌రించాడు. ఇక్క‌డ క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు బాగా జ‌రుగుతున్నాయ‌ని, తాను శాశ్వ‌తంగా ఇక్క‌డే ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపాడు.

క‌రోనా ఫ్రీ రిసార్ట్ బిజినెస్ చేస్తా.. సినిమాలు తీస్తా..

తాను భార‌త్‌లోనే ఉండిపోయేందుకు ఇక్క‌డి అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డం సుల‌భ‌మైన మార్గ‌మ‌ని, కానీ త‌న‌కు 74 ఏళ్ల వ‌య‌సు కావ‌డంతో అది సాధ్యం కాద‌ని చెప్పాడు పాల్. ఐదేళ్ల గ‌డువు ఉండే బిజినెస్ వీసా మంజూరు చేస్తే తాను కేర‌ళ‌లోని వాగ‌మాన్ ఏరియాలో ఓ రిసార్ట్ లీజుకు తీసుకుని న‌డుపుతాన‌ని తెలిపాడు. క‌రోనా బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉన్న అమెరికన్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను భార‌త్‌కు ర‌ప్పించి.. క‌రోనా ఫ్రీ జోన్ రిసార్ట్ నిర్వ‌హిస్తాన‌ని అన్నాడు. అలాగే ఇండియాలో రాజేశ్ అనే వ్య‌క్తి మంచి స్నేహితుడ‌య్యాడ‌ని, అత‌డి సినిమా స్క్రిప్ట్ రైట‌ర్ అని, అత‌డితో క‌లిసి సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నాన‌ని చెప్పాడు. 12 సినిమాల వ‌ర‌కు తాను ప్రొడ్యూస్ చేస్తాన‌ని, త్వ‌ర‌లోనే న‌టీన‌టుల కోసం ప్ర‌క‌ట‌న ఇవ్వ‌బోతున్నామ‌ని అంటున్నాడు పాల్.

Latest Updates