సిటీ చుట్టు నాలుగు ఆస్పత్రులు  డౌటే

సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నగరం నలువైపులా నాలుగు హాస్పిటల్స్ ఊసే లేకుండా పోయింది.  గత ఎన్నికల్లో ఇచ్చిన  హామీ ప్రకారం ఇప్పటికే ఈ హాస్పిటల్స్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది. గత మూడేళ్లుగా ఈ విషయంలో అటు వైద్య శాఖ అధికారులు గానీ ప్రభుత్వం గానీ  ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై ఎవరూ నోరు మెదపడం లేదు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త హాస్పిటల్స్ జోలికే వెళ్లకూడదన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి బడ్జెట్ లో వైద్య శాఖకు ప్రభుత్వం దాదాపు 5 వేల కోట్ల రూపాయల వరకు కేటాయించింది. కేసీఆర్ కిట్ తో పాటు ఇతర వైద్య పథకాలకే ఈ డబ్బులు ఖర్చయ్యే పరిస్థితి ఉంది. కొత్త హస్పిటల్స్ జోలికి వెళ్తే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.  ఒక్కో హాస్పిటల్ కు ఎంత లేదన్న అన్ని వసతులతో సిద్ధం చేయాలంటే దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది. నగరంలో నాలుగు వైపులా నాలుగు హాస్పిటల్స్ అంటే 2 వేల కోట్ల రూపాయల వరకు కావాలి. 5 వేల కోట్ల రూపాయల్లో 2 వేల కోట్ల వరకు హాస్పిటల్స్ నిర్మాణానికే ఖర్చు చేస్తే బడ్జెట్ కొరత తప్పదని అంచనా వేస్తోంది. దీంతో ఈ టర్మ్ లో కూడా నగరం చుట్టు నాలుగు హాస్పిటల్స్ నిర్మాణం అన్నది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మూడేళ్ల క్రితం ప్రకటన…

రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని ప్రజలైన తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చిందంటే హైదరాబాద్ కు పరుగులు పెట్టాల్సిందే. నగర శివారు వరకు వరకు ప్రయాణానికి ఎన్ని గంటల సమయం పడుతుందో అక్కడి నుంచి నగరంలోని పెద్దాస్పత్రులకు రావడానికి అంతే సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ కష్టాలను దాటి జనం హాస్పిటల్ వరకు చేరుకోవడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరం నలుమాలల నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలతో వీటిని తీర్చిదిద్దాలని అధికారులను మూడేళ్ల క్రితమే ఆదేశించారు. ఒక్కో హస్పిటల్ లో 750 పడకలు ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరం నాలుగు వైపులా స్థలాలను కూడా గుర్తించారు. శంకర్‌‌పల్లి మండలంలోని మైలార్‌‌దేవ్‌‌పల్లిలో 11.5 ఎకరాలు,  దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌లోని విక్టోరియా మెమోరియల్‌‌కు చెందిన స్థలంలో 15 ఎకరాల వరకు సేకరించాలనుకున్నారు. కొండాపూర్ వైపు ఏరియా దవాఖానా పరిసరాల్లోనే  కొత్త హాస్పిటల్ ను నిర్మించాలనుకున్నారు. మెదక్ నుంచి వచ్చే రోగుల కోసం అల్వాల్ ప్రాంతంలో 20 ఎకరాల్లో హాస్పిటల్స్ ప్రారంభించాలని నిర్ణయించారు.

ఆసక్తి చూపించని ప్రభుత్వం…

నగరం చుట్టు నాలుగు హాస్పిటల్స్ విషయంలో మొదట్లో హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం నుంచి హాస్పిటల్స్ నిర్మాణం విషయాన్ని పక్కన పెడుతూ వచ్చింది. మొదట్లో వీలైనంత వేగంగా హాస్పిటల్స్ నిర్మించాలంటూ పలుమార్లు స్వయంగా సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహించారు. అంతే వేగంగా స్థలాలను ఎంపిక చేశారు. ఇందులో మైలార్ దేవ్ పల్లిలో భూమిని కూడా సేకరించారు. ఆ తర్వాత హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ పనుల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ప్రతిపాదన స్థాయి నుంచి అడుగు ముందుకు పడలేదు. ఇక భవిష్యత్ లో ఈ హాస్పిటల్స్ నిర్మిస్తారన్న నమ్మకం కూడా లేదని వైద్య శాఖలోనే పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్స్ లోనే మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలు కల్పించాలని మాత్రమే భావిస్తున్నారు.  దీంతో నగరం చుట్టు నాలుగు హాస్పిటల్స్ కథ కంచికేనని తెలుస్తోంది.

Latest Updates