డ్రాగన్ ఫ్రూట్.. మేడిన్ సంగారెడ్డి.

dragon-fruit-farming-in-sangareddy-district

కొత్త పంట సాగు చేద్దామనుకున్నారు. కానీ, ఎలా పండించాలో పెద్దగా తెలియదు. అయినా ముందడుగు వేసి పండించారు. సరిగా దిగుబడి రాక చాలా నష్టం వచ్చింది. అయినా.. ఇవన్నీ మనకెందుకులే అని ఊరుకోలేదు. పోయిన చోటే వెతుక్కోవాలి అనుకున్నారు. పట్టు వదలకుండా డ్రాగన్ సాగు పాఠాలు నేర్చుకున్నారు. పకడ్బందీ ప్లాన్ తో పంట వేసి లాభాలు పండిస్తున్నారు.

సంగారెడ్డి, వెలుగు: లాభాల కోసమో.. లేదంటే రొటీన్​ పంటలు ఏం పండిస్తాం అనుకున్నారో ఏమో కానీ.. సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు రైతులు డ్రాగన్​ ఫ్రూట్స్‌‌ సాగు చేస్తున్నారు. కొండాపూర్‍ మండలం తోగర్‍పల్లిలో డాక్టర్‍ మాధవరం శ్రీనివాస్‍రావు ఆరు ఎకరాల్లో, సిర్గాపూర్‍ మండలం బొక్కస్‍గావ్‌‌లో సంగారెడ్డి అరెకరంలో పండ్ల తోటను సాగు చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ పంట మెక్సికో, చైనా, అమెరికా, మలేసియా, థాయిలాండ్‍, ఫిలిప్పైన్స్‌‌ , ఇజ్రాయిల్‍, బంగ్లాదేశ్‍, శ్రీలంక  దేశాల్లోనే పండుతుంది. డ్రాగన్​ ఫ్రూట్‌‌ని ‘స్ట్రాబెర్రీ పియర్’ అని కూడా పిలుస్తారు. పండ్లు చూసేందుకు ఎరుపు, గులాబీ రంగులు కలిసినట్టు ఉంటుంది. లోపల తెల్లని గుజ్జులో నల్లని గింజలు ఉంటాయి. దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. మన దేశంలో మహరాష్ట్ర, గుజరాత్‍లో సాగు చేస్తారు ఈ ఫ్రూట్‌‌ని. తెలంగాణలోనూ  కొందరు సాగు చేస్తున్నారు. కానీ.. వాళ్లలో చాలామంది సరైన సాగు పద్ధతులు తెలియక నష్టపోతున్నారు.

పదిహేనేళ్ల పంట

డ్రాగన్‍ ఫ్రూట్‍ మొక్కలు పదిహేను సంవత్సరాలపాటు కాయలు కాస్తాయి. ఇందులో చాలా రకాలు ఉన్నప్పటికీ సంగారెడ్డిలో మాత్రం వైట్‍ పల్ప్, రెడ్ పల్ప్‌‌ పండిస్తున్నారు. కాకపోతే ఈ పంట సాగుకు ఖర్చు చాలా ఎక్కువ. ఎకరానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. మామూలుగా విత్తనాలు నాటిన తర్వాత మొక్కలు పెరిగి కాతకు రావడానికి ఏడేళ్లు పడుతుంది. ఎదిగిన మొక్కలు తీసుకొచ్చి అంటుకడితే మూడేళ్లలో కాతకు వస్తాయి. ఇంత టైం ఆగాలా.. అనుకుంటే దీనికీ ఒక మార్గం ఉంది. అదేంటంటే.. అప్పటికే కాత దశలో ఉన్న మొక్కలను తీసుకొచ్చి నాటడం. చాలా మంది రైతులు ఇలానే నాటుతారు. మొదటి దఫాలో ఎకరాకు రెండు టన్నుల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత ఎకరానికి 12 టన్నుల దిగుబడి వస్తుంది. వన్‍ టైమ్‍ ఇన్వెస్ట్ చేస్తే పదిహేనేళ్లపాటు సంపాదించవచ్చు అంటున్నారు రైతులు శ్రీనివాస్‍రావు, సంగారెడ్డి. గ్లోబల్‍ గ్యాప్‍ పద్ధతిలో స్తంభాలను ఏర్పాటు చేసి, ఆర్గానిక్ ఎరువులు వేసి మొక్కలను పెంచితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక్కో మొక్కకు రెండు నెలలకోసారి ఒక గంప పశువుల ఎరువు వేయాలి.

శిక్షణ తీసుకుని..

మొదట్లో డ్రాగన్ ఫ్రూట్‌‌ సాగులో శ్రీనివాస్‍రావు, సంగారెడ్డి ఇద్దరూ ఫెయిలయ్యారు. హైదరాబాద్‍ కూకట్‍పల్లికి చెందిన డాక్టర్‍ శ్రీనివాస్‍రావు తొగర్‍పల్లిలో పదెకరాల భూమి కొన్నాడు. అందులో ఆరెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్‍ సాగు చేశాడు. అయితే సాగు విధానం సరిగా తెలియకపోవడంతో నష్టపోయాడు. కాపు రాలేదు. దాంతో శ్రీనివాస్‍రావు  ఫిలిప్పీన్స్, మలేసియా, థాయిలాండ్‍, శ్రీలంక దేశాలకు వెళ్లి డ్రాగన్ ఫ్రూట్‍ సాగుపై అధ్యయనం చేశాడు. కొన్ని దేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ సాగు చేసి సక్సెస్‍ అయ్యాడు. పోయిన సంవత్సరం నుంచి డ్రాగన్​ మొక్కలు కాయలు కాస్తున్నాయి. ‘నా సక్సెస్‌‌కు కారణం మా నాన్న ప్రసాద్‍రావు ఇచ్చిన స్ఫూర్తే. డ్రాగన్‍ ఫ్రూట్‍ సాగు మొదలు పెట్టినప్పుడు చాలా మంది నిపుణులను కలిశాను. అందరూ వద్దనే చెప్పారు. అయినా పట్టు వదలక సాగు చేశా. ఇప్పుడు లాభాలు వస్తుండటంతో చాలామంది నా దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారు’ అంటున్నాడు మాదవరం శ్రీనివాస్‍రావు.

పేపర్లో చదివి..

పేపర్‌‌‌‌లో వచ్చిన కథనాలు చదివి డ్రాగన్‌‌ ఫ్రూట్‌‌ సాగు చేశాడు సంగారెడ్డి. పంట చేతికొచ్చినా దిగుబడి ఆశించినంత రాలేదు. దాంతో చాలా నష్టపోయాడు. తర్వాత కోల్‌‌కతాలోని  బంధువుల దగ్గరకు వెళ్లి అక్కడ సాగు విధానం తెలుసుకున్నాడు. మొక్కలు కూడా అక్కడినుంచే తెప్పించి అరెకరంలో నాటాడు. నాలుగేళ్ల క్రితం పంట చేతికొచ్చింది. మొక్కలు ఏడాదిలో ఎనిమిది సార్లు కాయలు కాస్తున్నాయి.  ‘నాలుగేళ్ల క్రితం సాగు చేస్తే నష్టం వచ్చింది. ఉద్యానవన అధికారులను సలహాలు అడిగితే పట్టించుకోలేదు. తర్వాత కోల్‌‌కతా వెళ్లి అక్కడి నుంచి మొక్కలు తీసుకువచ్చాను. బంధువుల సలహాలు తీసుకుంటూ పండించాను. మంచి పంట దిగుబడి వస్తుంది. లాభాలు కూడా వస్తున్నాయి. ఫ్రూట్స్‌‌ను హైదరాబాద్‍, సంగారెడ్డి, కూకట్‍పల్లి మార్కెట్లలో అమ్ముతున్నా’ అంటున్నాడు సంగారెడ్డి.

 

డ్రాగన్ ఫ్రూట్‍ రుచే వేరు

డ్రాగన్‍ ఫ్రూట్‍ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. దీనికి డెంగ్యూ వ్యాధిని తగ్గించే గుణం కూడా ఉందంటారు. షుగర్‍, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు వెంట్రుకలకు కూడా బలాన్ని ఇస్తుంది. తెల్లబడకుండా, రాలిపోకుండా చూస్తుంది. డ్రాగన్‍లో సోడియం, పొటాషియం, పాస్ఫరస్‍, మెగ్నీషియం, ఐరన్‍, క్యాల్షియం ఉంటాయి.

Latest Updates