చెన్నైకి తాగునీరు : రవాణాకే తడిసి మోపెడు

మంచి చి నీళ్లు లేక విలవిల్లాడుతున్న చెన్నైలో సర్కారు చేపట్టిన టెంపరరీ చర్యలు అక్కడి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని ఎక్స్‌‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఒక్కో లీటరుకు మామూలు కన్నా మూడు రెట్లు ఖర్చవుతోందని చెబుతున్నారు. సమస్యను పర్మనెంట్‌‌గా పరిష్కరించడానికి లాంగ్ టర్మ్ ప్లాన్ అవసరమంటున్నారు. వాటర్ రీచార్జ్ జోన్లు పెంచాలని, వెట్‌‌లాండ్స్‌‌లో ఆక్రమణలు ఆపాలని సూచిస్తున్నారు. ‘నీళ్లు లేక అల్లాడుతున్న ప్రాంతాలకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేలూరు జిల్లా జోలార్ పేట్ నుంచి తాగునీటిని ట్రైన్ ద్వారా చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు సరఫరా చేస్తోంది. దీనికవుతున్న ఖర్చు ట్రిప్పుకు రూ.8.67 లక్షలు. అంటే లీటర్ నీటికి రూ.3.17. మామూలుగా బయట అమ్మే నీటి కన్నా మూడు రెట్లు ఎక్కువ. దీనికి నీటిని పంపు చేయడం, శుద్ధి చేయడం, సరఫరా లెక్కగట్టలేదు’ అని నిపుణులు చెబుతున్నారు.

డెవలప్‌‌మెంట్ అంటూ ఆక్రమణ

చెన్నైలోని పల్లవరం, కీళ్కట్టలై చెరువులను ఆక్రమించారు. ఈ చెరువుల చుట్టూ 200 అడుగుల  రేడియల్ రోడ్డు వేశారు. పల్లవరం చెరువు దక్షిణం వైపు చెత్తతో నిండిపోయింది. రేడియల్ రోడ్డునూ 100 అడుగుల మేర ఆక్రమించారు.  రేడియల్ రోడ్ల విస్తరణ పనులకు వరల్డ్ బ్యాంక్ రూ.35 కోట్లు ఇస్తున్నట్టు కేర్ ఎర్త్  కు చెందిన జయశ్రీ వెంకటేశన్ చెప్పారు. ఈ ప్రాజెక్టుతో పల్లవరం, కీళ్కట్టలై, నారాయణపురం చెరువుల్లో 40 ఎకరాల వెట్‌‌లాండ్‌‌ను ఆక్రమించేస్తారని తెలిపారు.

లీక్‌‌లు లేకుండా తరలించలేరా?

పెట్రోలు, పాలల్లా లీకవకుండా నీటిని ఎందుకు తరలించడం లేదని ఎక్స్‌‌పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు. తాగునీటిని సరఫరా చేసే వ్యాగన్లు, ట్యాంకర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉందని, లెడ్ లాంటి హెవీ మెటల్స్ పెయింట్లను ట్యాంకర్లకు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. లెడ్ లాంటి కెమికల్స్ తాగునీటిలో కలిస్తే శారీరక, మానసిక సమస్యలొస్తాయని, చిన్నపిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కెమికల్స్, పెట్రోల్‌‌ను తరలించే వ్యాగన్లలో తాగునీటిని తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీటి వాడకంపై కొత్త పాలసీ తీసుకురావాలంటున్నారు.

రోజుకు కోటి లీటర్లే

వేలూరు జిల్లా జోలారుపేట నుంచి కావేరి సహకార తాగునీటి పథకం నీటిని చెన్నైకి తరలించడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.65 కోట్లు కేటాయించింది. శుక్రవారం జోలారుపేట నుంచి 2 ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించారు. 100 వ్యాగన్లలో (50 లీటర్ల సామర్థ్యం)  50 లక్షల లీటర్ల నీటిని తీసుకొచ్చారు. ఆ నీటిని శుద్ధి చేసి సరఫరా చేయనున్నారు. ఇలా రోజుకు కోటి లీటర్లు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Latest Updates