దళితులకు మూడెకరాల భూమి ఎక్కడ?

దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి  ఇవ్వాలని  రాష్ట్ర  ప్రభుత్వం భావిస్తున్నటికీ ఆచరణ సాధ్యం కావడం లేదు. రాష్ట్ర సర్కార్ కు సాగు యోగ్యమైన భూమి దొరకడం లేదు. అనేక కారణాలతో  గ్రామాల్లో భూముల రేట్లు పెరిగాయి. అలాగే రైతు బంధు పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం అందుతోంది. దీంతో భూములు అమ్ముకోవడానికి  పెద్ద రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు  దళితులకు భూపంపిణీలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసే భూమి ఎకరాకు ఆరు లేదా ఏడు లక్షల రూపాయలకు మించి ఇవ్వడం లేదు. ఈ నిబంధన ఇప్పుడు దళితుల భూమి పంపిణీ పథకానికి  ప్రతిబంధకంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి ఈ భూముల కొనుగోలు ఒక సవాల్ గా మారింది.

వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకాల్లో వచ్చే చాలీచాలని కూలీ డబ్బులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న దళితులకు భూమినిచ్చి ఆసరాగా  నిలవాలనుకున్నా ఈ నిబంధన వల్ల పూర్తి స్థాయిలో భూ పంపిణీ  అమలు కావడం లేదు. అయితే నిబంధన సంగతి ఎలాగున్నా భూమి కొనుగోలుకోసం కేటాయించిన నిధులను  దళిత కుటుంబాల సంక్షేమానికి  మళ్లించాలి. తమకంటూ సొంత భూమి లేని బడుగులకు ఇప్పటికే కొన్ని చోట్ల భూములు అందాయి. అనేక జిల్లాల్లో  అర్హులు ఎక్కువ మంది ఉండటంతో భూముల పంపిణీ ప్రక్రియ జాప్యం అవుతోంది. ఎస్సీ కార్పొరేషన్ కు గతంలో  చైర్ పర్సన్ ను నియమించినా, డైరెక్టర్లను మాత్రం నియమించలేదు. కార్పొరేషన్ కు వెంటనే డైరెక్టర్లను నియమించాలి. దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాలను ప్రారంభించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి దళిత కుటుంబానికి ఐదు లక్షల లోనును బ్యాంకుతో సంబంధం లేకుండా  మంజూరు చేయాలి. సామాన్య దళిత కాలనీ సమస్యలను క్రైటేరియాగా సర్కార్ తీసుకోవాలి. దళితుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి .

 గుండమల్ల సతీశ్ కుమార్

Latest Updates