DSP హోదా తొలగింపు : హర్మన్ ప్రీత్ డిగ్రీ సర్టిఫికెట్స్ నకిలీవే

భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ DSP హోదాను తొలిగిస్తూ..మంగళవారం (జూలై-10) పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె ఫేక్‌ డిగ్రీ సర్టిఫికేట్స్‌ సమర్పించారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పోలీస్‌ శాఖ.. అవి నకిలీవేనని తేల్చింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ DSP ర్యాంకు హోదాను తొలిగించారు అధికారులు. గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌ లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సెమీస్‌ లో ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో భారత్‌ ను ఫైనల్‌ కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఆమె ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో DSP జాబ్‌ ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
2011లో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి తాను డిగ్రీ పాసైనట్లు హర్మన్ ప్రీత్.. పోలీసు శాఖకి సర్టిఫికేట్స్ సమర్పించారు. అయితే.. విచారణలో అవి నకిలీవని తేలింది. దీంతో.. ఇక నుంచి హర్మన్‌ ప్రీత్‌ ని 12వ తరగతి మాత్రమే పాసైనట్లుగా పంజాబ్ ప్రభుత్వం చూస్తుందని.. ఆమె అర్హతకి పోలీసు శాఖలో ఒప్పుకుంటే కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. హర్మన్‌ ప్రీత్ ఇంటర్నేషనల్ క్రికెట్ భవిష్యత్‌ ను దృష్టిలో పెట్టుకుని, ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. ఒకవేళ హర్మన్‌ ప్రీత్‌ పై FIR నమోదు చేస్తే.. ఇప్పటికే ఆమె అందుకున్న అర్జున అవార్డునూ కోల్పోవాల్సి ఉంటుంది.
ఈ ఘటనపై హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మేనేజర్‌ స్పందిస్తూ.. ఈ విషయంలో ఇప్పటి వరకు పంజాబ్‌ పోలీస్‌ శాఖ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. ఇదే సర్టిఫికేట్‌ తో ఆమె రైల్వేలో ఉద్యోగం చేసిందని, అది ఇప్పుడేలా నకిలీది అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక ఆమె పంజాబ్‌ పోలీస్‌ శాఖలో చేరేంత వరకు రైల్వే ఉద్యోగం చేశారు.

Posted in Uncategorized

Latest Updates