అనాథ బాలిక అ‌త్యాచారం కేసు.. నిందితుడితో పాటు ఆశ్ర‌మ నిర్వాహ‌కులు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి డి.ఎస్.పి రాజేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. ప్రధాన నిందితుడు ఆశ్రమానికి దాతలుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి తో పాటు ఆశ్ర‌మ నిర్వాహకులు విజయ, జయదేవ్ ల‌ను పూర్తిస్థాయిలో విచారణ జ‌రప‌గా.. వేణు గోపాల్ రెడ్డి బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు. ఆశ్ర‌మ వార్డెన్ విజయ , ఆమె సోద‌రుడు జయ దేవ్ ఇందుకు సహకరించిన‌ట్టు తేలింద‌న్నారు.

“బాలిక హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతకు ముందే బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశాం.జరిగిన అన్యాయం గురించి బాలిక పూర్తిగా వివరించింది. బాలికతో పాటు మరికొంత మంది చిన్నారుల స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. లాక్ డౌన్ లో ఈ ఘాతుకం జరిగింది. మే నెలలో బాలిక బోయిన్ పల్లి లోని కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళింది. ఆ స‌మ‌యంలో అమ్మాయి ఒంటిపై గాయాలయ్యాయి”అని తెలిపారు.

ఈ కేసులో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని చెప్పారు డిఎస్‌పీ. ఒక కేసు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో బాలిక‌పై జరిగిన అత్యాచారం, మరొక కేసు బాలికపై జరిగిన భౌతిక దాడి. ఈ విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల ప్రకారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంద‌ని అ‌న్నారు. బాలిక‌పై ఆమె బంధువులే భౌతిక దాడికి పాల్పడ్డారా లేదా హాస్టల్ లో ఎవరైనా దాడికి పాల్పడ్డారా అని విచారణ జరుగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారం కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామ‌ని పూర్తిస్థాయిలో లో విచారణ చేపడుతున్నామని డిఎస్పీ చెప్పారు. ఇప్పటికే నిందితులపై 2012 పోక్సో ఆక్ట్ ప్రకారం పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

Latest Updates