దేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులు కండి : రఘునందన్ రావు

దేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులు కండి : రఘునందన్ రావు

మెదక్ జిల్లా: దేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం TTWREI సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్, ఆదిలాబాద్ జిల్లాల గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ ను ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రఘునందన్ రావు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని చెప్పారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు  ఉంటుందని,  పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల ఇష్టాన్ని పెంచుకోవాలని అన్నారు. క్రీడాకారులు తమ కోచ్ లు చెప్పినట్లుగా వినాలని చెప్పారు.

క్రీడాకారులకు క్రమశిక్షణ చాలా అవసరమని,  గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఘర్షణకు పాల్పడొద్దని సూచించారు. ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని పాటించాలని క్రీడాకారులను కోరిన ఎమ్మెల్యే.. రగ్బీ, హ్యాండ్ బాల్ తదితర క్రీడలకు కోచ్ ల కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తానని రఘునందన్ రావు హామీ ఇచ్చారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రావు, ఆర్సీవో, ప్రిన్సిపాల్స్, పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.