60 కేసుల్లో నిందితుడు.. గ్యాంగ్‌స్టర్‌‌‌ దూబే ఖేల్‌ఖతం

  • ఎన్‌కౌంటర్‌‌లో మట్టుబెట్టిన పోలీసులు
  • వారం రోజుల పాటు తప్పించుకుని తిరిగిన దూబే
  • నిజాలు బయటికొస్తాయని చంపేశారు: ప్రతిపక్షాలు
  • రాజకీయనాయకులతో పరిచయాలు

కాన్పూర్‌‌: 8 మంది పోలీసుల హత్య కేసులో నిందితుడు, 60 కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌‌ వికాస్‌ దూబే చాప్టర్‌‌ క్లోజ్‌ అయింది. శుక్రవారం ఉదయం పోలీసులు ఆయన్ను ఎన్‌కౌంటర్‌‌లో హతమార్చారు. మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని నుంచి ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌‌కు తరలిస్తున్న టైంలో పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపి పోలీసులు హతమార్చారు. గురువారం ఉజ్జయినిలో పట్టుబడ్డ వికాస్‌ దూబేను పోలీసులు కాన్పూర్‌‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో కాన్వాయ్‌లోని ఒక వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా చూసిన దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. లొంగిపోవాలని పోలీసులు చెప్పినా ఖాతరు చేయలేదు. పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయని, తీవ్రంగా గాయపడ్డ వికాస్‌ను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారని ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దూబేకు చెందిన ఐదుగురు అనుచరులను పోలీసులు ఎన్‌కౌంటర్‌‌ చేశారు. దీంతో ఈ కేసులో ఎన్‌కౌంటర్‌‌కు గురైన వారి సంఖ్య 6కి చేరింది. అంతే కాకుండా చాలా మందిని అరెస్టు చేశారు.

ఎవరూ దూబే?

ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌ దగ్గర్లోని బిక్రు గ్రమానికి చెందిన వికాస్‌ దూబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీ షీటర్‌‌ నుంచి గ్యాంస్టర్‌‌గా ఎదిగాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగించేవాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో ఒక్క చౌభేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి అతనిపై కేసులు ఉన్నాయి, పొలిటికల్‌ సపోర్ట్‌తో ఏ కేసులో కూడా శిక్ష పడకుండా తప్పించుకునే వాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వికాస్‌ ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకుంటాడని సమాచారం. యూపీలోని బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో వికాస్‌కు పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏ కేసులో కూడా సాక్ష్యాలు సరిగా లేవని అందుకే శిక్షపడకుండా తప్పించుకున్నాడని అధికారులు చెప్పారు. గతంలోపోలీస్‌స్టేషన్‌లోనే బీజేపీ మంత్రిని వికాస్‌ హతమార్చినట్లు కేసు నమోదైందని పోలీసులు చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రితో కూడా వికాస్‌కు సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన ఉజ్జయిని వెళ్లి లొంగిపో గలిగాడని సీనియర్‌‌ జర్నలిస్ట్‌ ఒకరు చెప్పారు.

బీజేపీ బండారం బయటికొస్తుందనే చంపారు: అఖిలేశ్‌ యాదవ్‌

వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌‌పై యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శలు చేశారు. వికాస్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, వారి గురించి బయట పెడతారనే భయంతోనే ఎన్‌కౌంటర్‌‌ చేశారని ఆరోపించారు. “ కారు బోల్తా పడలేదు. కానీ సీక్రెట్లను ఓవర్‌‌ టర్న్‌ చేసి ప్రభుత్వం సురక్షితంగా ఉంది” అని అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాయి.

ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో పిల్

వికాస్‌ దూబే అనుచరులపై జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టులో పబ్లిక్‌‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ (పిల్‌) దాఖలైంది. ఎన్‌కౌంటర్‌‌కు సంబంధించి సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఈ పిల్‌ వేశారు. వికాస్‌ ఎన్‌కౌంటర్‌‌ కంటే కొన్ని గంటల ముందు కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దూబేను కూడా ఎన్‌కౌంటర్‌‌ చేసే ప్రమాదం ఉందని దాంట్లో పొందుపరిచారు కూడా. ఘనశ్యామ్‌ ఉపాధ్యాయ అ​నే వ్యక్తి ఈ పిల్‌ను వేశారు. దుబేకు సెక్యూరిటీ ఇవ్వాలని ఆయన దాంట్లో కోరారు.

గన్‌ శబ్దం వినిపించింది.. పోలీసులు దగ్గరికి వెళ్లనివ్వలేదు

“ పెద్ద గన్‌ శబ్దాలు వినిపించాయి. చూసేందుకు అక్కడికి వెళ్తే పోలీసులు మమల్ని అక్కడి నుంచే పంపేశారు” అని ఎన్‌కౌంటర్‌‌ జరిగిన స్థలం దగ్గర ఉన్న కొంత మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంబులెన్స్‌రాలేదని, సొంత వాహనాల్లో అందరూ అతన్నితీసుకుని హాస్పిటల్‌కు వెళ్లారని మరో వ్యక్తి మీడియాతో చెప్పారు.

ఈ వారం రోజులు ఏం జరిగింది?

ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌కు చెందిన వికాస్‌ దూబేపై పలు సెక్షన్ల కింద దాదాపు 60 కేసులు ఉన్నాయి. దాంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు కావడంతో అతడిని అరెస్టు చేసేందుకు నాలుగు పోలీస్‌స్టేషన్లకు చెందిన పోలీసులు గత శుక్రవారం  గ్రామానికి వెళ్లారు. కాగా.. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారం అందుకున్న దూబే తన గ్యాంగ్‌తో కలిసి పోలీసులపై దాడి చేసి 8 మందిని హతమార్చి పారిపోయాడు. రాజస్థాన్‌లోని కోటా మీదుగా దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి హరియాణాలోని ఫరీదాబాద్‌ చేరుకున్నాడు. అక్కడ పోలీసుల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోనిఉజ్జయినిలో పోలీసులకు చిక్కాడు. దూబే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 40 టీమ్‌లుగా విడిపోయి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని గురించి సమాచారం అందించన వారికి రూ.5లక్షలు పరిహారం కూడా ప్రకటించారు. దూబే ఐదుగురు అనుచరులను పోలీసులు ఎన్‌కౌంటర్‌‌ చేసి చంపేశారు.

Latest Updates