నీటి కరువుతో గొంతెండుతున్న రాష్ట్రం

due to summer season.. water problems heavy in Telangana state
  • పల్లె నుంచి పట్నం దాకా నీళ్ల గోస
  • ఎండిపోయిన బోర్లు.. నోళ్లు తెరిచిన బావులు
  • మారుమూల ఊళ్లు, తండాల్లో చుక్కనీటి కోసం మైళ్ల దూరం
  • మడుగులు, చెలిమెల నీళ్లే దిక్కు
  • సిటీల్లో జోరుగా ప్రైవేటు ట్యాంకర్ల దందా
  • పూర్తికాని మిషన్‌ భగీరథ పనులు

వెలుగు నెట్​వర్క్​: తెలంగాణ గొంతు ఎండుతున్నది. నీళ్ల కోసం జనం పుట్టెడు కష్టాలు పడుతున్నరు. గుక్కెడు నీళ్ల కోసం మైళ్లకు మైళ్లు నడుస్తున్నరు. పల్లె, పట్నం అని తేడా లేదు. అన్నిచోట్ల అదే గోస. బోర్లు ఎండిపోయినయి. బావులు అడుగంటినయి. పట్నాలకు ట్యాంకర్ల నీళ్లే దిక్కవుతున్నయి. ఇక పల్లెల్లో నీళ్ల కోసం నిత్య సమరం సాగుతున్నది. నీటి జాడ దొరికితే చాలు ఆడ, మగా, పిల్లాజెల్లా బిందెలు పట్టుకొని పొలాలు, గుట్టలు దాటుతున్నరు. మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాగుల్లోని చెలిమెలు, మడుగుల్లో పాకురుపట్టిన నీళ్లనే బంగారం లెక్క తీసుకపోతున్నరు. ఆ నీళ్లు తాగి రోగాలపాలైతున్నరు. మిషన్‌ భగీరథ వచ్చుడెప్పుడో.. దప్పిక తీర్చేదెప్పుడో అని జనం యాష్ట పడుతున్నరు.

 నీళ్లు లేక ఊరు ఖాళీ
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎన్టీఆర్​ కాలనీలో
నీటి ఎద్దడి తట్టుకోలేక సుమారు 25
కుటుంబాలు వలస పోయాయి.
కొందరైతే ఇలా ఇళ్లను
అమ్మకానికి పెట్టారు

సింగూరు, మంజీరా నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్‌ తాగునీళ్ల కోసం అల్లాడుతోంది. జలమండలి రోజు విడిచి రోజు నల్లాలు, వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా అవి అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని జనం అంటున్నారు. నీళ్ల కష్టాలు పెరగడంతో జలమండలి బేవరేజ్ కంపెనీలకు వాటర్ సప్లయ్ నిలిపివేసి ఆ నీళ్లనే నగరవాసులకు అందిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. చాలాచోట్ల మూడు, నాలుగు రోజులకోసారి నీళ్లు అందుతున్నాయి. శేరిలింగంపల్లి, మాదాపూర్, పటాన్ చెరు, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ సెక్షన్ పరిధిలోని అనేక ప్రాంతాలకు నాలుగు రోజులకోసారి నీరందుతోంది. నీటి ఎద్దడి నేపథ్యంలో వాటర్ బోర్డు ఉచిత ట్యాంకర్ల సంఖ్య ను 90కి పెంచినా  ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ తగ్గడం లేదు. 5 వేల లీటర్ల నీటి ట్యాంకర్ కోసం రూ.1,500 వరకు వసూలు చేస్తుండగా.. రూ.500 లకు లభించే జలమండలి ట్యాంకర్ కోసం మూడ్రోజుల దాకా ఎదురుచూడాల్సి వస్తున్నది. సిటీలో చాలాప్రాంతాల్లో 800 ఫీట్లు లోతుకు బోర్‌ వేస్తున్నా చుక్క నీరు రావడం లేదు.

ఇవి కరెంటు వైర్లు కావు.. టీవీ కేబుల్స్​ కావు
చూడడానికి ఇవి కరెంటు వైర్లలా , టీవీ కేబుల్స్ లా కనిపిస్తు న్నా.. కరెంటు వైర్లు కావు, టీవీ కేబుల్స్ కావు. మిషన్ భగీరథ పథకం కిం ద ఊరిలో పైపులైన్లు బిగిం చకపోవడంతో ఇలా జనం వాటర్ ట్యాంకుకే పైపులు వేసుకుని దప్పిక తీర్చుకుంటున్నా రు. నల్గ ొండ జిల్లా తిరుమలగిరి(సాగర్ ) మండలం జాల్ తండాలోనిదీ దుస్థితి. ఒకే  ఒక్క బోరుబావి ద్వారా అదీ కరెంట్ ఉన్న సమయంలో ట్యాంక్ ను నిం పడంతో ఆ నీటిని ఈ రకంగా పైపుల సుమారు 300 కుటుంబాలు పట్టుకుంటున్నాయి. ఈ ట్యాంక్ ను నింపేది ఐదు రోజులకోసారి మాత్రమే.

కంటింజెన్సీ ప్లాన్‌ ఏది?
జిల్లాల్లో మిషన్‌ భగీరథ పనులు ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. ఇంట్రా విలేజ్‌ పనులింకా కొనసాగుతున్నాయి. ట్యాంకుల నిర్మాణం పనులు కూడా కాలేదు. ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్రస్థాయిలో కంటింజెన్సీ ప్లాన్‌ రూపొందిస్తారు. దీనికింద జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, తాగునీటి కటకట ఉన్న ప్రాంతాలకు అద్దె బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీళ్లందిస్తారు. కానీ భగీరథ నీళ్లు వస్తాయన్న నమ్మకంతో ఈసారి కంటింజెన్సీ ప్లాన్‌ రూపొందించలేదు. దీంతో అటు భగీరథ నీళ్లు రాక, ఇటు అధికార యంత్రాంగం నుంచి సరైన ప్రణాళిక లేక ఊళ్లల్లో నీళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామస్థులే ప్రైవేటు ట్యాంకర్లను అద్దెకు తీసుకొని నీటిని తెప్పించుకుంటున్నారు. మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది.

నీళ్లు ఊరితేనే.. నోళ్లు తడుస్తయ్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిట్టతోగు, చింతలపాడులో గిరిజనుల తిప్పలివీ!  పినపాక మండలం ఉప్పాక, మల్లారం, పోతురెడ్డిపల్లి, ఏడూళ్ల బయ్యారం గ్రామాలకు  భగీరథ పైప్‌లైను నిర్మించినా వాటర్ ​ట్యాంకులకు నీరు ఎక్కడం లేదు. ఉప్పాకలో రెండు కి.మీ. దూరంలో ఉన్న ఉయ్యాల చెరువు ఊట బావి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు.

నీళ్లు లేక ఊరు ఖాళీ
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎన్టీఆర్​ కాలనీలో నీటి ఎద్దడి తట్టుకోలేక సుమారు 25 కుటుంబాలు వలస పోయాయి. కొందరైతే ఇలా ఇళ్లను అమ్మకానికి పెట్టారు.

నీళ్ల గోస..కొన్ని జిల్లాల్లో ఇలా..
జగిత్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లో చుక్క నీరు లేక జనం వ్యవసాయ బావులకు క్యూ కడుతున్నారు. ఇంకొన్నిచోట్ల కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కొన్ని గ్రామాల్లో సర్పంచ్‍లే సొంత ఖర్చుతో ట్యాంకర్లను తెప్పించి నీళ్లిస్తున్నారు.

బురద నీళ్లే మహా ప్రసాదం
కొత్తగూడెం జిల్లా రాళ్లపాడు గుత్తికోయల గిరిజనులకు ఈ బురద నీరే దిక్కవుతోంది. పొట్టచేత పట్టు కుని బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రం నుంచి వచ్చిన గుత్తికోయలకు చెందిన 73 గ్రామాలు తాగునీటికి అల్లా డుతున్నాయి. రోజులో సగం సమయం వాగుల్లో చెలిమ నీళ్లు తెచ్చుకోవడానికే వెచ్చిస్తు న్నారు. అవి కూడా దొరకని కొన్ని గ్రామాల్లో చెరువుల్లోని బురద నీళ్లను తీసుకెళ్లి తాగుతున్నారు.

నీళ్ల గోస..కొన్ని జిల్లాల్లో ఇలా..
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు నియోజకవర్గం రాయపర్తి మండలంలోని తండావాసులు తాగునీళ్లకు ఇబ్బందులు పడుతున్నారు. చేతి పంపులు పని చేయడం లేదు. నర్సంపేట డివిజన్‌లో వాగుల్లోని కొద్దిపాటి నీళ్ల కోసం అర కిలోమీటర్‍ మేర నడవాల్సి వస్తోంది.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌‌, మెదక్‌‌, అందోల్‌‌ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లోని 150కి పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామాల్లో భగీరథ పైప్‌‌లైన్లు పూర్తయి, ఇళ్లకు నల్లా కనెక్షన్‌‌లు ఇచ్చినా మంజీరా నదిలో నీళ్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు.

తలాపున గోదారి ఉన్నా.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని రాంనగర్​ వాసులు అల్లాడిపోతున్నారు. పేరుకే ఇది పెద్ద మున్సిపాలిటీ. రెండు నెలలుగా ఇక్కడి రాంనగర్​వాసులకు మంచినీళ్లు  అందడం లేదు. మహిళలంతా ఏకమై ఇటీవల ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించినా ఫలితం దక్కలేదు. కనీసం చేతిపంపుతోనైనా నీళ్లు అందుతాయనుకుంటే అవి చెడిపోయి ఆరునెలలు గడుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఉప్పాక, మల్లారం, పోతురెడ్డిపల్లి, ఏడూళ్లబయ్యారం గ్రామాలకు మిషన్​ భగీరథ పైపులైను నిర్మించినప్పటికీ వాటర్​ట్యాంకులకు నీరు ఎక్కడం లేదు. ఫలితంగా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊట బావుల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆ నీళ్లు కలుషితమవడంతో.. వాటిని తాగి జనం రోగాలపాలవుతున్నారు.

Latest Updates