పోలీసుల పేరుతో బంగారాన్ని దోచుకున్నరు…

పోలీసుల పేరుతో ఓ బంగారం వ్యాపారిని దోచుకున్న వారిని రేణిగుంట GRP పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముకుందరాజన్ అనే అతను కోయంబత్తూరుకు చెందిన బంగారు వ్యాపారి. అతను ప్రతీవారం ప్రొద్దుటూరుకు వెళ్లి బంగారం వ్యాపారం చేసుకుని తిరిగి కోయంబత్తూరుకు వెళ్లేవారు. అయితే అదే ఊరిలో రాజశేఖర్ అలియాస్ శేఖర్ అనే మరో బంగారం వ్యాపారి ఉన్నాడు. శేఖర్ కు భారీగా అప్పులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. దీంతో ముకుందరాజన్ ను దోచుకోవడానికి పథకం పన్నాడు శేఖర్. ఇందుకు పుల్లారెడ్డి, ప్రసాద్ అనే మరో ఇద్దరి సహాయం తీసుకున్నాడు.

ముకుందరాజన్ కదలికలపై నిఘా వేసిన శేఖర్ టీం. పోలీసుల రూపంలో ముకుందరాజన్ ను దోచుకోవడానికి ప్లాన్ వేశారు. ఈనెల 11వ తారీకున… ముకుందరాజన్ ప్రొద్దుటూరులో తన వ్యాపారాన్ని పూర్తి చేసుకుని… జయంతి ఎక్స్ ప్రెస్ రైలులో కోయంబత్తూరుకు ప్రయాణమయ్యాడు. పోలీసుల వేశంలో ఉన్న పుల్లారెడ్డి, ప్రసాద్ లు ముకుందరాజన్ ను ఫాలో అయ్యారు. ట్రైన్ చిత్తూరు దాటిన తర్వాత దొంగబంగారాన్ని తరలిస్తున్నాడంటూ ముకుందరాజన్ ను బెదిరించారు పుల్లారెడ్డి, ప్రసాద్ లు. దీంతో ముకుందరాజన్ దగ్గర ఉన్న 1080 గ్రాముల బంగారాన్ని, రెండు మోబైల్ ఫోన్స్ ను తీసుకుని… అతన్ని పాకాల రైల్వేస్టేషన్ లో దింపారు. పొద్దున 10 గంటలకు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కలవాలని  పుల్లారెడ్డి, ప్రసాద్ లు చెప్పి ఆటోలో పరారయ్యారు.

పొద్దున చిత్తూరు పోలీస్ స్టేషన్ ముకుందరాజన్ వెళ్లగా అసలు విషయం తెలిసింది. దీంతో నిందితుల కోసం గాలించిన పోలీసులు ఈ రోజు శేఖర్, పుల్లారెడ్డి, ప్రసాద్ లను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి దొంగిలించిన సొత్తును రికవరీ చేసి కేసును నమోదు చేసుకున్నారు.

Latest Updates