
భూమి స్పీడ్ పెరిగింది!
సగటున రోజుకు 0.05 మిల్లీ సెకన్లు తగ్గిన టైం
టైం నుంచి ఒక లీప్ సెకన్ను తీసేయాలన్న చర్చ
2020లో తొందరగా గడిచిన 28 రోజులు
జులై 19న 1.4602 మిల్లీ సెకన్ల తగ్గుదల
2005 జులై 5న 1.0516 సెకన్ల రికార్డు బద్దలు
‘ఏందో ఏమో.. రోజులు ఇంత తొందరగా గడిచిపోతున్నయి. చూస్తుండంగనే టైం అయిపోతున్నది’.. ఏదో ఒక సందర్భంలో అందరూ అనుకునే ఉంటరు. అంతెందుకు 2020 తొందరగా అయిపోతే బాగుండు అని అనుకున్నోళ్లూ ఉంటరు. ఆ రెండు నిజమే అయ్యాయి. భూమి తిరిగే స్పీడ్ పెరిగింది. టైం స్పీడ్‌గా గడిచిపోతున్నది. 2020 తొందరగా పూర్తయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. నిరుడు 28 రోజులు మామూలు టైం కన్నా వేగంగా గడిచినయి. సగటున ఒక్కోరోజు 0.05 మిల్లీ సెకన్లు తక్కువగా రికార్డయింది. యాభై ఏళ్లలోనే ఇది రికార్డ్. గతంలో భూమి వేగం తగ్గితే 28 సార్లు ఒక లీప్ సెకన్ను టైంకు కలిపారు. ఇప్పుడు ఆ ఒక్క లీప్ సెకన్ను టైం నుంచి తీసేయాలన్న చర్చ జరుగుతోంది. చూడటానికి తక్కువ టైమే అయినా ఈ టైమ్వో భూమి వేల కిలోమీటర్లు సుట్టేస్తది.
పారిస్: భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరిగొస్తే ఒకరోజు అని అంటారు. అంటే 24 గంటలు.. 86,400 సెకన్లు. కానీ, ఆ టైం కన్నా ముందే భూమి రొటేషన్ పూర్తయిపోతోంది. ఒక రోజులో సగటున అరక్షణం టైం తగ్గిపోయింది. మొత్తం ఏడాదికి లెక్కిస్తే అది 19 మిల్లీ సెకన్లుగా తేలింది. అందుకే తొలిసారిగా ఈ ఏడాది ఒక లీప్ సెకన్ను టైం నుంచి తీసేద్దామన్న ఆలోచనలో సైంటిస్టులున్నారు. అయితే, రాబోయే రోజుల్లో భూమి వేగం ఎంతుంటుందో పరిశీలించాకే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, వాతావరణ పీడనం (ప్రెజర్), గాలి ప్రభావం, మహాసముద్రాల ప్రవాహాలు, భూకేంద్రకం (కోర్)లో కదలికల వల్ల భూమి వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
చరిత్ర తిరగరాసిన 2020
2005లో తొలిసారిగా 28 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. ఆ ఏడాది జులై 5న ఒక రోజులో కొన్ని మిల్లీ సెకన్లు తక్కువగా నమోదయ్యాయి. దాదాపు 1.0516 మిల్లీ సెకన్ల ముందే రోజు గడిచింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను 2020 తిరగరాసేసింది. ఆ ఏడాది లాగానే 2020లోనూ 28 రోజులు చాలా వేగంగా పూర్తయ్యాయి. జులై 19న రోజు తొందరగా పూర్తయింది. రికార్డ్ స్థాయిలో 1.4602 మిల్లీ సెకన్ల టైం రోజులో తక్కువైంది.
లీప్ సెకన్ అంటే?
మామూలుగా మనకు నాలుగేళ్లకోసారి లీప్ సంవత్సరం వస్తుంటుంది. కారణం.. ప్రతి ఏడాది పావు రోజు ఎక్కువ ఉంటుంది. ఈ నాలుగేళ్లలో ఆ పావు రోజులన్నింటినీ కలిపి లీప్ సంవత్సరంగా చెబుతారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఒక రోజును కలుపుతారు. అలాంటిదే ఈ లీప్ సెకన్ కూడా. కో ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం (యూటీసీ)లో మార్పులకు తగ్గట్టు 24 గంటల టైంలో ఒక క్షణ కాలాన్ని సర్దుబాటు (అడ్జస్ట్) చేయడాన్నే లీప్ సెకన్ అంటారు. ఆటమిక్ గడియారాలతో నిర్ణయించే కచ్చితమైన సమయం, కచ్చితత్వంలేని సౌర సమయానికి (సోలార్ టైం) మధ్య తేడాలొచ్చినప్పుడు.. ఆ గ్యాప్‌ను పూడ్చేలా దానిని అడ్జస్ట్ చేస్తుంటారు. సర్దుబాటు చేయాలనుకున్నప్పుడు 6 నెలల ముందే దానిపై నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ లీప్ సెకన్ వ్యవహారాన్ని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్ సర్వీస్ (ఐఈఆర్‌ఎస్) చూస్తూ ఉంటుంది. మామూలుగా జూన్ లేదా డిసెంబర్లోనే లీప్ సెకన్ను సర్దుబాటు చేస్తారు.
లాభనష్టాలేంటి?
లీప్ సెకన్ వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి టెలీకమ్యూనికేషన్స్, స్టాక్స్, సాఫ్ట్వేర్ రంగాలపై దీని ప్రభావం పడుతుందని చాలా మంది లీప్ సెకన్లపై అభ్యంతరం చెప్పారు. వివిధ ఇండస్ట్రీల్లో యూటీసీకి తగ్గట్టు టైంను అడ్జస్ట్ చేస్తుంటారు. అయితే, లీప్ సెకన్ వల్ల ఇండస్ట్రీలు పెట్టుకున్న టైం, యూటీసీలో కొన్ని లక్షల రెట్ల తేడాలు వస్తున్నాయని అంటున్నారు. 2012 జూన్ 30లో లీప్ సెకన్ను కలపడం వల్ల రెడిట్, మొజిల్లా, ఖంటాస్, లైనక్స్ ఓఎస్‌లో నడిచే కొన్ని సాఫ్ట్‌వేర్‌లో సమస్యలొచ్చాయి. 2003 నవంబర్28న మోటోరోలా ఆన్కోర్లోని వీపీ, యూటీ, జీటీ, ఎ12 జీపీఎస్ రిసీవర్లకు సిగ్నళ్లు అందలేదు. 2015 జనవరి 21న కొన్ని జీపీఎస్ రిసీవర్లు.. లీప్ సెకన్ను కలిపే జూన్ 30 కన్నా ముందే ఆ టైంను చేర్చడంతో సమస్యలొచ్చాయి. స్టాక్‌మార్కెట్లపైనా ప్రభావం పడుతుంది. 2015 జూన్ 30న లీప్ సెకన్ సర్దుబాటు వల్ల న్యూయా ర్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సహా 11 స్టాక్ ఎక్స్చేంజ్ల వ్యవహారాలు చూసే ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ 61 నిమిషాలు మూతపడింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ స్ట్రీమింగ్‌లకు 2015లో 40 నిమిషాలు అంతరాయం ఏర్పడింది.
ఇప్పటికి 28 సార్లు కలిపిన్రు
కచ్చితమైన శాటిలైట్ మెజర్మెంట్స్ వచ్చిన 1960 నుంచి భూమి తిరిగే వేగం తగ్గింది. దానికి తగ్గట్టు 1972 నుంచి ప్రతి ఏడాదిన్నరకు ఒక లీప్ సెకనును కలుపుతూ వచ్చారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఎస్టీ) ప్రకారం.. ఇప్పటిదాకా 28 సార్లు లీప్ సెకన్ను యాడ్ చేశారు. చివరి సారిగా 2016లో లీప్ సెకనును కలిపారు. కొత్త సంవత్సరం మొదలైనప్పుడు ఆ రోజ టైంను 23 గంటల 59 నిమిషాల 59 సెకన్లుగా లెక్కించారు. దీంతో ఒక సెకనును కలిపారు. అయితే, ఇప్పటి ట్రెండ్స్ ప్రకారం తొలిసారిగా ఒక క్షణాన్ని తొలగించాలని భావిస్తున్నారు. ‘‘భూమి వేగం మరింత పెరిగితే కచ్చితంగా ఓ లీప్ సెకన్ ను తీసేయాలి. అయితే, అది జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడే తేల్చలేం’’ అని బ్రిటన్‌లోని నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ ఫిజిసిస్ట్ పీటర్ విబ్బర్లీ చెప్పారు.