భూమి కదులుతోంది.. ఊర్లు వణుకుతున్నయ్

భూమి కదులుతోంది.. ఊర్లు వణుకుతున్నయ్

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగుఈ నెల 1న 9 సార్లు, 5న 23 సార్లు, 9న -62 సార్లు,10న 36 సార్లు అక్కడ భూమి కంపించింది. గతేడాది డిసెంబర్ 1న మొదలైన భూ ప్రకంపనలు రెండు నెలలుగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరో రెండు మండలాలపైనా ప్రభావం చూపుతున్నాయి. రెండు నెలల్లో సుమారు 500 సార్లు భూమి కంపించినట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్ పై నమోదైంది. ఇప్పటివరకు ఇక్కడ రికార్డయిన భూకంప తీవ్రత గరిష్ఠంగా 4.6 మేగ్నట్యూడ్​ కాగా, 6 మేగ్నట్యూడ్ వరకు ఎలాంటి నష్టం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మండల ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్య  భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఇంట్లోని వస్తువులు కదులుతున్నాయని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ప్రధానంగా భూకంప కేంద్రం ఉన్న పాత వెల్లటూరు, గుడిమల్కాపురం, కిష్టాపురం గ్రామాల్లో జనమంతా ఆరుబయటే నిద్రిస్తున్నారు. తమ కష్టాలను ఏ అధికారీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

భూకంప కేంద్రం పాత వెల్లటూరు

భూకంపాలన్నీ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూరు కేంద్రంగా నమోదవుతున్నట్లు జియాలజిస్టులు ధ్రువీకరించారు. ప్రారంభంలో రోజుకు 3, 4 సార్లు మాత్రమే వచ్చిన ప్రకంపనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భూభౌతిక పరిశోధనా సంస్థ(యన్జీఆర్ఐ) అధికారులు రెండుసార్లు చింతలపాలెం మండలంలో పర్యటించి మూడు సిస్మోగ్రాఫ్ లను ఏర్పాటు చేశారు. వాటి సహాయంతో భూకంప తీవ్రతను లెక్కగడుతున్నారు. పాత వెల్లటూరులో గరిష్ఠంగా 4.6 మేగ్నట్యూట్ ప్రకంపనలు నమోదయ్యాయి. కొందరి ఇళ్ల గోడలు బీటలు వారాయి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.  చింతలపాలెం మండలంతోపాటు మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లోనూ ప్రకంపనలు నమోదవుతున్నాయి. భూకంప కేంద్రం గల చింతలపాలెం మండలం లోని 16 గ్రామాలతోపాటు, మేళ్లచెరువు  మండలంలోని 20 గ్రామాలు, మఠంపల్లి మండలంలోని గ్రామాలు ఎఫెక్ట్​ అవుతున్నాయి. జనవరి 25 రాత్రి 4.6 తీవ్రతతో వచ్చిన భూకంపం, వంద కిలోమీటర్ల పరిధిలోని సుమారు 90 గ్రామాలపై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పులిచింతల ప్రాజెక్టే కారణమా?

భూప్రకంపనలకు సమీపంలోని పులిచింతల ప్రాజెక్టే కారణమని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. దీని సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో తొలిసారి అంటే గతేడాది సెప్టెంబర్ కల్లా పూర్తిగా నింపారు. ఆ తర్వాత మూడు నెలల నుంచే ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నేలలో సున్నపురాయిఎక్కువగా ఉందని, డ్యామ్ లో స్టోర్ చేసిన నీరు భూపొరలలోకి చేరి సున్నపు రాయిని కరిగించడం వల్ల ప్రకంపనలు వస్తున్నాయని జియాలజిస్టులు తనతో చెప్పినట్లు ఇటీవల హుజూర్​నగర్​ ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. పులిచింతల డ్యాంలో పూర్తి నీటిని ఓ ఆరు నెలల పాటు నిల్వ ఉంచితే బాగుండేదని, కొద్దిరోజుల్లోనే 20 టీఎంసీలను దిగువకు విడుదల చేయడం వల్ల రాతి పొరలు ఇంకా సర్దుబాటుకాక ప్రకంపనలు కొనసాగుతున్నాయని చెప్పారు. స్థానికులు ఎలాంటి భయాందోళన చెందవద్దని సూచించారు.