
రిక్టర్‌స్కేల్‌పై 4.6గా నమోదు
కంపనాల కేంద్రం సూర్యాపేట జిల్లా పాత వెల్లటూరు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని కోదాడ, అనంతగిరి, చిలుకూరు, హూజూర్‌నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో, వరంగల్ అర్బన్, జనగామ, వరంగల్‌రూరల్, ఖమ్మం జిల్లాల్లో శనివారం రాత్రి భూమి కంపించడంతో జనం ఉలిక్కి పడ్డారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. చాలామంది నిద్రపోకుండా తెల్లారేవరకు వేచి చూశారు. కొందరు ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు.
మరో నెలరోజులు వచ్చే అవకాశం
ఈ ప్రాంతంలో వస్తున్న భూకంపాలన్నీ మాధ్యమిక తరంగాలేనని, దీనివల్ల భారీ శబ్దాలు వస్తాయని, ప్రాణనష్టం ఉండదని శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ తెలిపారు. ఆదివారం ఆయన ఆర్డీవో కిషోర్ కుమార్ తో కలిసి చింతలపాలెం మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు. భూకంపం నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంభవించినట్లు తెలిపారు. భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు కేంద్రంగా భూకంపం వచ్చినట్లు గుర్తించామన్నారు. జనవరి 12 నుంచి 26 వరకు 300 సార్లు భూప్రకంపనలు నమోదయ్యాయని చెప్పారు.
మరో నెలపాటు చిన్న భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యాపేట ప్రాంతం లైమ్, శాండ్‌స్టోన్‌తో కూడినదని, ఈ రకమైన శిలలున్నచోట 4.6 తీవ్రత మునుపెన్నడూ రాలేదని అన్నారు. దీనిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. చిన్న చిన్న భూకంపాలతో లోపల ఒత్తిడి బయటకు పోతుందని, ఈ ప్రాంతంలో మున్ముందు భూకంపాలు వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నారు. ఈ ప్రాంతంలోని కట్టడాల పటిష్టతపై సర్వే చేయించాలని ఆర్డీవోకు సూచించారు.