లాక్ డౌన్ పెట్ట‌డం ఈజీనే.. ఎత్తేయ‌డం క‌ష్టం: మే 3 త‌ర్వాత‌ పొడిగింపుపై సోమ‌వారం క్లారిటీ

లాక్ డౌన్ పెట్ట‌డం సుల‌భ‌మేన‌ని, కానీ ఎత్తేయ‌డ‌మే చాలా క‌ష్ట‌మ‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ ను తొల‌గించే ముందు చాలా ప‌రిణామాల‌ను లెక్క‌లోకి తీసుకోవాల‌ని చెప్పారాయ‌న‌. శ‌నివారం ఆయ‌న‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తేయ‌డం అంత సులువు కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రైళ్లు, విమానాల‌ను అన్ని నిలిచిపోయి ఉన్నాయ‌ని, వాటిని మ‌ళ్లీ మొద‌లుపెడితే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది ముందే అంచ‌నా వేయాలని చెప్పారు. ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారు? అంద‌రూ సోష‌ల్ డిస్టెన్ పాటించేలా చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌దానిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని అన్నారు.

ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ లో క్లారిటీ..

దేశ వ్యాప్తంగా మే 3 త‌ర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అన్న‌ది సోమ‌వారం సీఎంల‌తో ప్ర‌ధాని మోడీ నిర్వ‌హించే వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశంలో క్లారిటీ రావ‌చ్చ‌ని అన్నారు అశోక్ గెహ్లాట్. ఒక వేళ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ ను స‌డ‌లించాల‌ని అనుకుంటే ఒక్కో రాష్ట్రంలో ప‌రిస్థితిని బ‌ట్టి కేంద్రం ప్ర‌త్యేక‌మైన కేర్ తీసుకోవాల‌ని చెప్పారు. రాష్ట్రాల వారీగా వాటి అవ‌స‌రాలు వేర్వేరుగా ఉన్నాయ‌న్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాను ఒక్కో ర‌కంగా చూడాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అధికారాల‌ను వికేంద్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అలా చేస్తేనే విజ‌య‌వంతంగా ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించి, క్ర‌మంగా లాక్ డౌన్ నుంచి బ‌య‌ట‌ప‌డుతామ‌ని చెప్పారు.

శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 24,942 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో 779 మంది మ‌ర‌ణించ‌గా.. 5,210 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాజ‌స్థాన్లో 2034 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. వారిలో 230 మంది డిశ్చార్జ్ కాగా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest Updates