
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలకు ఎలక్షన్ కమిషన్షాక్ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లద్దర్నీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ నుంచి వెంటనే తొలగించాలని బీజేపీని ఈసీ బుధవారం ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ ఇద్దరు నేతలు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వారిపై యాక్షన్ తీసుకుంది. ‘దేశద్రోహులను కాల్చి చంపండి’ అంటూ ఈనెల 27న ఢిల్లీ ప్రచారసభలో కేంద్రమంత్రి ఠాకూర్ రెచ్చగొట్టేలా నినాదాలిచ్చినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈసీకి ఇచ్చిన రిపోర్ట్‌లో చెప్పారు. దీనిపై ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈనెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కూడా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. ‘‘లక్షలాది మంది ప్రజలు అక్కడ (షహీన్ బాగ్)లో గుమిగూడారు. వాళ్లు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు. మీ అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయొచ్చు. ఇవాళ మీకు టైం ఉంది. మోడీ కానీ, అమిత్‌షా కానీ మిమ్మల్ని రేపు కాపాడలేకపోవచ్చు’’ అంటూ పర్వేష్ రెచ్చగొట్టేలా కామెంట్ చేశారు. ఈ కామెంట్స్‌పై తీవ్ర దుమారం రేగింది.
కేజ్రీవాల్ ఓ టెర్రరిస్ట్: మళ్లీ నోరుజారిన పర్వేష్
షహీన్ బాగ్ లో కామెంట్స్చేసి అడ్డంగా బుక్ అయిన బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ.. లేటెస్ట్గా మరో కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. ఈసారి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. బుధవారం ఢిల్లీ ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. కేజ్రీవాల్‌ను టెర్రరిస్టుతో పోల్చారు.
అమిత్ షా ప్రచారంపై బ్యాన్‌కు ఆప్ విజ్ఞప్తి
కేంద్రమంత్రి అమిత్‌షా ప్రచారంపై 48 గంటలపాటు బ్యాన్ పెట్టాలని ఆమ్ఆద్మీ పార్టీ ఎలక్షన్ కమిషన్‌ను కోరింది. ఢిల్లీ స్కూల్స్‌పై కేంద్ర హోంమంత్రి తప్పుడు వీడియోలు పోస్ట్‌చేశారని ఆప్ ఆరోపించింది. ఢిల్లీలోని చాలా స్కూల్స్ “దారుణమైన కండిషన్”ఉన్నాయని తమపార్టీ ఎంపీలు గుర్తించారంటూ అమిత్ షా మంగళవారం ట్వీట్ చేశారు.ఈమేరకు ఫుటేజీని కూడా కేంద్రమంత్రి పోస్ట్‌చేశారు. దీనిపై రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్… మూసి ఉన్న స్కూల్స్‌ను బీజేపీ వీడియో తీసిందని ఆరోపించారు.