ఎకో ఫ్రెండ్లీ టీస్టాల్.. మీకు తెలుసా?

చలికాలంలో గరం గరం చాయ్‌‌ తాగినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో కదా! అయితే టీస్టాల్‌‌లో వాడే ప్లాస్టిక్‌‌ వల్ల హాయితో పాటు అనారోగ్యం బోనస్‌‌గా వస్తుంది. ప్లాస్టిక్‌‌పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని టీస్టాల్‌‌లో ఇంకా ప్లాస్టిక్‌‌ గ్లాసుల్లోనే టీ ఇస్తున్నారు. తాగే నీళ్లు కూడా ప్లాస్టిక్‌‌ డబ్బాల్లోనే పెడతారు. అవి కూడా ఏ బోర్‌‌‌‌ వాటరో అయ్యుంటాయి. అలాంటి టీస్టాల్‌‌లో టీ తాగితే రోగాలు రాకుండా ఉంటాయా మరి! అందుకే రాజు చిక్కని చాయ్‌‌తోపాటు చక్కని ఆరోగ్యాన్నీ పంచాలనుకున్నాడు. అందుకే ఎకో ఫ్రెండ్లీ టీస్టాల్‌‌ నడుపుతున్నాడు.

హైదరాబాద్‌‌లోని కూకట్‌‌పల్లిలో బీజేపీ ఆఫీస్‌‌ను ఆనుకుని రోడ్డు పక్క ఒక చిన్న టీస్టాల్‌‌.. అక్కడికి వెళ్లగానే రాజు రాగి గ్లాస్‌‌లో మినరల్‌‌ వాటర్‌‌‌‌ ఇస్తాడు. రాగి పాత్రలో పెట్టిన చాయ్‌‌ని పింగాణీ గ్లాస్‌‌లో పోసి చేతికందిస్తాడు. ఈ స్టాల్‌‌లో వాడే ప్రతి వస్తువు ఎకో ఫ్రెండ్లీగానే ఉంటుంది. రాజుది కర్నాటకలోని గుల్బర్గా. ఉపాధి కోసం చిన్నప్పుడే హైదరాబాద్‌‌కు వచ్చాడు. కొన్నాళ్లు వంటమాస్టర్​గా పనిచేసి, మూడు సంవత్సరాల క్రితం సొంతంగా టీ స్టాల్ పెట్టుకున్నాడు. రాగి పాత్రలో టీ చేయాలన్న ఆలోచనకు కారణం అమ్మ అంటున్న రాజు మాటల్లో మరిన్ని వివరాలు..

అమ్మ చెప్పింది..

మా ఇంట్లో అమ్మ రాగి బిందెలు మాత్రమే ఉపయోగించేది. చిన్నప్పటి నుంచి రాగి బిందెల్లో నీళ్లే తాగాం. ఆ నీళ్లు తాగితే ఆరోగ్యా నికి మంచిదని అమ్మ చెప్పింది. అందుకే టీస్టాల్‌‌లో రాగి పాత్రలు మాత్రమే వాడుతున్నా.  మార్కెట్‌‌లో దొరికే రాగిబిందెలకు ట్యాప్​లు ఉండవు. వాటిని కొని సొంతంగా ట్యాప్​లు తయారుచేయించి, పెట్టించా. లేకపోతే కస్టమర్స్​ చేతుల్ని బిందెలో ముంచుతారు. దీంతో వాటర్ కలుషితమవుతుంది. అప్పుడు రాగి బిందెలు పెడితే ఏం లాభం. నీళ్లు శుభ్రంగా ఉండాలి కదా.

పోటీ ప్రపంచంలో నిలబడాలంటే..

ఇదే ఏరియాలో వరుసగా పది అడుగుల దూరంలోనే ఐదారు టీ స్టాళ్లు ఉన్నాయి. అయినా.. నేను వాడుతున్న రాగి పాత్రలు వ్యాపారంలో నిలదొక్కుకునేలా చేశాయి. రాగి పాత్రల్లో వాటర్​ తాగడానికి వచ్చే రెగ్యులర్​ కస్టమర్స్ కూడా ఉన్నారు. మూడు కిలోమీటర్ల దూరం నుంచి టీ తాగడానికి ​ వస్తున్నారంటే అంతా రాగి చలవే.

క్యాటరింగ్​లో అనుభవం..

నేను ఇదివరకు వంటమాస్టర్​గా పనిచేశా. స్టార్​ హోటల్స్​లో క్యాటరింగ్​ చేసినప్పుడు రాగిపాత్రల్లో వంటలను డిస్​ప్లే చేసిన విధానం చూశా. వాటిని చూడగానే భోజనం చేయాలనిపిస్తుంది. అందుకే నేను కూడా అదే ఫాలో అయ్యా. అంతే కాదు టీస్టాల్​ను ఎప్పుడు శుభ్రంగా ఉంచుతా. అందుకే చాలా దూరంనుంచి కూడా కస్టమర్​లు వస్తుంటారు.

టీ స్టాల్​కు వెళ్లగానే టీ ఆర్డరిచ్చాక మంచినీళ్లు తాగాలనిపిస్తుంది. కానీ ప్లాస్టిక్​ మగ్​లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల నీళ్లు తాగేందుకు ఇష్టపడరు. కస్టమర్లకు అలాంటి ఫీల్​ కలగకూడదనే రాగి బిందెల్లో నీళ్లు పెడుతున్నా.

పార్శిల్​ కోసం సిల్వర్​ కవర్లు..

టీ పార్శిల్​ కోసం చాలామంది ప్లాస్టిక్​ కవర్లు వాడతారు. కానీ, నేను మాత్రం సిల్వర్​ కవర్లను మాత్రమే వాడతా. కస్టమర్ల ఆరోగ్యం కోసం ఖర్చు ఎక్కువైనా వీటినే వాడుతున్నా. నన్ను చూసి చుట్టుపక్కల టీ స్టాల్స్​ వాళ్లు కూడా సిల్వర్​ కవర్లు వాడుతున్నారు.

కొత్తగా ఆలోచించండి..

వ్యాపారం, ఉద్యోగం ఏదైనా సరే.. అందులో కొత్తగా ఏదైనా ప్రయత్నించండి.
అందరికంటే భిన్నంగా ఉంటేనే లోకం గుర్తిస్తుంది. అప్పుడే పోటీ ప్రపంచంలో రాణించగలం. ఆలోచించి పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏం లేదు. ఏదైనా సరే నిజాయితీగా చేయండి. అప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది’ అంటున్నాడు రాజు. ఇంత చెప్పి టీ ఎలా ఉంటుందో చెప్పలేదు కదూ! చెప్పడం కాదు. తాగి చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడైనా కూకట్​పల్లి వెళ్తే, మహాలక్ష్మీ టీ స్టాల్‌‌​కు వెళ్లి, రాగిపాత్రల్లో మంచినీళ్లు, టీ తాగే ఛాన్స్​ మిస్​కాకండి. ధర కూడా పెద్దగా ఉండదు. 10 రూపాయలకే చిక్కని ఛాయ్ ఇస్తాడు​.​                                                       సత్యనారాయణ భూపతి

Latest Updates