
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ కొడుకు చైతన్య బాఘేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం అరెస్టు చేసింది. రూ.2,100 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కొన్ని ఆధారాల ఆధారంగా, ఈడీ రైడ్స్ చేసాక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని సెక్షన్ 19 కింద అతని ఇంట్లోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈడీ సోదాల సమయంలో చైతన్య బాఘేల్ సహకరించకపోవడం, పార్టీ కార్యకర్తలు భారీగా గుమిగూడటంతో భిలాయ్ ఇంటి ముందు భారీగా పోలీసు బలగాలు మోహరించారు. విశేషం ఏంటంటే చైతన్య పుట్టినరోజున ఈ అరెస్టు జరిగింది, ఈ విషయాన్ని భూపేశ్ బాఘేల్ ఎత్తి చూపుతూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు.
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజున కీలక అంశం చర్చల దృష్టిని మళ్లించడానికే ఈ దాడి అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన భూపేశ్ బాఘేల్ సోషల్ మీడియాలో విమర్శించారు.
ALSO READ : నాకు తమ్ముడి లాంటివాడు.. లోకేష్ను కలిస్తే తప్పేంటి.?
కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2022 మధ్య ఈ మద్యం కుంభకోణం జరిగిందని ED ఆరోపించింది. సమాచారం ప్రకారం చైతన్య బాఘేల్ ఈ కుంభకోణం ద్వారా వచ్చిన ఆదాయంలో అనుమానితుడుగా గుర్తించినట్లు, అలాగే రాష్ట్ర ఖజానాను ఖర్చు చేస్తూ ఒక మద్యం సిండికేట్ ద్వారా రూ.2,100 కోట్లకు పైగా అక్రమ లాభాలను ఆర్జించినట్లు తేలింది.
ఈ కేసులో మాజీ మంత్రి కవాసి లఖ్మా, అన్వర్ ధేబర్, మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా, ఐటీ అధికారి అరుణ్‌పతి త్రిపాఠి సహా చాల మంది ప్రముఖుల అరెస్టులు జరిగాయి. ఇప్పటివరకు రూ.205 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
2024లో ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా ED దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ECIR)ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ED తెలిపిన విషయాలను ఉపయోగించి కొత్త FIR దాఖలు చేయాలని ఛత్తీస్‌గఢ్ ఆర్థిక నేరాల విభాగం (EOW) అవినీతి నిరోధక బ్యూరో (ACB)లను కోరింది.
2023 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై బిజెపి విజయం తరువాత గత ఏడాది జనవరి 17న EOW/ACB కొత్తగా FIR నమోదు చేసింది. ఈ ఫిర్యాదులో మాజీ ఎక్సైజ్ మంత్రి కవాసి లఖ్మా, మాజీ ప్రధాన కార్యదర్శి వివేక్ ధండ్ సహా 70 మంది పేర్లు ఉన్నాయి. చైతన్య బాఘేల్ పై ఈడీ చర్య తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. మార్చి 10న కూడా ఇలాంటి దాడులు జరిగాయి.