నరేశ్ గోయల్‌కు బిగుస్తున్న ఉచ్చు

న్యూఢిల్లీజెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఫౌండర్‌‌ నరేశ్‌‌ గోయల్‌‌కు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ మూతపడగా, ఈయన మనీలాండరింగ్‌‌ చేసినట్టు గట్టి ఆధారాలు దొరికాయని ప్రభుత్వం ప్రకటించింది. గోయల్‌‌ నివాసాలపై శుక్రవారం దాడులు చేసిన ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) శనివారం ఈయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. పన్నులు ఎగ్గొట్టడానికి ఎన్నో కుట్రలు చేశారని, ఎన్నో నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. విదేశీ మారక రూల్స్‌‌ను అతిక్రమించినట్టు నమోదైన కేసులో ఈడీ శుక్రవారం ముంబై, ఢిల్లీలోని గోయల్‌‌ ఆఫీసుల్లో, నివాసాల్లో తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా ఎన్నో కీలకపత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు దొరికాయని తెలిపింది. వీటిన్నింటినీ పరిశీలిస్తున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. దేశవిదేశాల్లో గోయల్‌‌ కంపెనీలు పన్నులు ఎగ్గొట్టడానికి ఎన్నో ‘పథకాల’ను రచించారని ఆరోపించింది. నకిలీ, మోసపూరిత లావాదేవీల ద్వారా భారీగా నిధులను మళ్లించారని తెలిపింది. విమానాల లీజు, నిర్వహణ ఒప్పందాల ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలను విదేశీ కంపెనీలకు చెల్లించినట్టు జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ తప్పుడు లెక్కలు చూపిందని పేర్కొంది. కమీషన్ల మొత్తాన్ని ఎక్కువ చేసి చూపించి, ఇండియా నుంచి విదేశాలకు డబ్బులు పంపించిందని వివరించింది. విదేశీ ఖాతాల్లో ఉన్న భారీ మొత్తాలన్నీ గోయల్‌‌కు చెందినవేనని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నిధులన్నీ ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా సేకరించినవేనని ఈడీ ఆరోపించింది. విదేశీ ఆస్తుల వివరాలను దాచినందుకు గోయల్‌‌పై కఠిన సెక్షన్లను ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోయల్‌‌కు మొత్తం 19 కంపెనీలు ఉండగా, వీటిలో ఐదింటిని విదేశాల్లో రిజిస్టర్‌‌ చేశారు. ఐల్‌‌ ఆఫ్‌‌ మ్యాన్‌‌ దేశం నుంచి నడిచే టేల్‌‌ విండ్స్‌‌ కార్పొరేషన్‌‌ జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ వ్యవహారాలన్నింటినీ కంట్రోల్‌‌ చేసినట్టు ఈడీ గుర్తించింది. గోయల్‌‌ దీనిని 1992లో స్థాపించారు.

ఎంసీఏ ఆదేశాల మేరకు విచారణ..

గోయల్‌‌ పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపిస్తుండగా, జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌కు మాత్రం  దాదాపు రూ.11 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.  నిర్వహణకు కూడా డబ్బుల్లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌ 17న జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ను మూసివేశారు. బ్యాంకర్లు ఈ కంపెనీ వాటాలను విక్రయించేందుకు వీలుగా చైర్మన్‌‌ పదవి నుంచి గోయల్‌‌ మార్చిలోనే తప్పుకున్నారు. అయితే బ్యాంకుల కన్సార్షియం బిడ్డింగ్‌‌కు స్పందన రాలేదు.దీంతో చివరికి జెట్‌‌ కేసును ఎన్సీఎల్టీకి అప్పగించారు.    కంపెనీలో నిధుల గోల్‌‌మాల్‌‌పై కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) విచారణకు ఆదేశించింది.  గోయల్‌‌ విదేశాలకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ నిధుల మళ్లింపునకు పాల్పడిందని స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌బీఐ) నిర్వహించిన ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌లో తేలింది.

Latest Updates