V6 News

నీట్​పై హైలెవల్ కమిటీ .. ఎవరు తప్పు చేసినా వదలిపెట్టం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

నీట్​పై హైలెవల్ కమిటీ ..  ఎవరు తప్పు చేసినా వదలిపెట్టం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం.. వారితో రాజకీయాలు వద్దు
  • కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినయ్
  • బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నం
  • క్వాలిఫై స్టూడెంట్స్​పై ప్రభావం ఉండదు
  • పేపర్ లీక్.. ఎన్​టీఏ ఇన్​స్టిట్యూషనల్ వైఫల్యమని కామెంట్

న్యూఢిల్లీ:  నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేయిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో.. కొన్ని చోట్ల మాత్రమే తప్పులు జరిగినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల విష‌‌‌‌యంలో రాజీప‌‌‌‌డే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగిన తప్పులు.. నిర్ధిష్టమైన ప్రాంతాలకు మాత్రమే పరిమితమని అన్నారు. క్వాలిఫై అయిన లక్షలాది మందిపై ప్రభావం ఉండదని భరోసా ఇచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని అన్నారు. ఎప్పటికప్పుడు కేసు వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. పేపర్ లీక్ చేసి లక్షలాది మంది స్టూడెంట్ల భవిష్యత్తుతో ఆటలాడుకున్న వారిని వదిలేది లేదన్నారు. హైలెవల్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.   ఎంక్వైరీ  ప్రాసెస్ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, ఈ విషయంలో ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తాను కూడా స్వయంగా బిహార్ ప్రభుత్వంతో పాటు అక్కడి పోలీసు యంత్రాంగంతో మాట్లాడుతున్నట్టు వివరించారు. 

ఎన్​టీఏ పనితీరును సమీక్షిస్తున్నం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) పనితీరును కూడా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్​టీఏలోనే తప్పు జరిగినట్టు తేలితే అక్కడి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై పూర్తి రిపోర్టు అందజేయాలని బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు. ‘‘ఎన్​టీఏ పనితీరును సమీక్షిస్తున్నం. ఏజెన్సీ పూర్తి స్ట్రక్చర్.. అందులో ఎవరెవరు ఉంటారు? ఏం పని చేస్తారు? ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి? పారదర్శకత ఉందా? డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటిస్తున్నారా? అనేది హై లెవల్ కమిటీ ద్వారా తెలుసుకుంటాం. ప్రతి ఎంట్రెన్స్ టెస్టులో జీరో ఎర్రర్​కు కట్టుబడి ఉన్నం. సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్న పుకార్లును నమ్మొద్దు. ఎవరైనా తప్పుడు స్టేట్​మెంట్లు ఇచ్చినా.. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసినా..  వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. కొందరు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా మేమే మీ ముందుకు వచ్చి చెప్తాం. ఈ ఇష్యూను చాలా సీరియస్​గా తీస్కున్నం. పేపర్ లీకేజీకి పాల్పడినవారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. వారిని విడిచిపెట్టం’’ అని కేంద్ర మంత్రి అన్నారు.  

దర్యాప్తు స్పీడప్ చేశాం

విద్యార్థులే.. దేశ భవిష్యత్తు అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పాట్నా పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారని, మరికొంత సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. పబ్లిక్ ఎగ్జామ్స్​లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. లక్షలాది మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారని తెలిపారు. వారిలో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన స్టూడెంట్లు మంచి మార్కులతో పాటు మెరుగైన ర్యాంకులు సాధించారని చెప్పారు. కొందరు చేసిన తప్పులకు వారి కెరీర్​ను తాకట్టుపెట్టలేమన్నారు. 

ఎగ్జామ్ కంటే ముందే డార్క్​నెట్​లో యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్

జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్ 2024 ఎగ్జామ్​ను కూడా రద్దు చేసినట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మంగళవారమే ఎగ్జామ్ జరిగిందని, బుధవారం పరీక్షను రద్దు చేయడానికి ప్రధాన కారణం ఉందన్నారు. ఎగ్జామ్ కంటే ముందే యూజీసీ నెట్ ఎగ్జామ్ పేపర్ డార్క్​నెట్​లో లీక్ అయిందని తెలిపారు. ఈ విషయాన్ని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్​పర్ట్స్ యూజీసీ నెట్ దృష్టికి తీసుకొచ్చిందన్నారు. దీంతో ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్టు యూజీసీ నెట్ ప్రకటించిందని తెలిపారు. టెలిగ్రామ్​లో సర్య్యులేట్ అయిన యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్, ఒరిజినల్ ప్రశ్నాపత్రంతో మ్యాచ్ అయిందని తెలిపారు. ఎన్​టీఏ ఇన్​స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ కారణంగానే పేపర్ డార్క్ నెట్​లోకి వెళ్లిందన్నారు. సంస్కరణల కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.