వానకాలం పంటలకు ఎరువులు ఎట్ల?

వారంలో సీజన్‌‌ షురూ.. సప్లైపై ఎఫెక్ట్‌‌ తప్పదా?
4.50 లక్షల టన్నులుండాల్సిన బఫర్‌‌ స్టాక్‌‌ కూడా ఒక్క బస్తా లేదు
మార్క్‌‌ఫెడ్‌‌, సహకార సంఘాలు, డీలర్ల వద్ద కూడా స్టాక్‌‌ తక్కువే

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి వానలు మంచిగనే పడుతయని వాతావరణ శాఖ చెబుతోంది… రైతులు కూడా వానకాలం పంటల సాగుకు రెడీ అవుతున్నరు. వారంలో రుతుపవనాలు రానున్నాయి… సీజన్‌‌ కూడా షురూ కానుంది. అయితే పంటలెయ్యనికి అవసరమైన యూరియా, డీఏపీ లాంటి ఎరువుల నిల్వలు చాలా తక్కువ ఉండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వానకాలంలో మొత్తం 22.30 లక్షల టన్నుల ఎరువులు అవసరమైతే.. 6.91 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నయి. సీజన్‌‌ మొదట్లో అవసరాల కోసమని ఏటా 4.50 లక్షల టన్నుల బఫర్‌‌ స్టాక్‌‌  పెడుతరు. కానీ ఈ సారి బఫర్‌‌ స్టాక్‌‌ ఒక సంచి కూడా లేదు. అట్లనే ఈ సీజన్‌‌ కోసం 10.50 లక్షల టన్నుల యూరియా కేటాయించగా ఇప్పటికి పావు వంతు కూడా రాలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ సారి యూరియా సప్లైపై ఎఫెక్ట్‌‌ పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

రెడీగా ఉన్న యూరియా 2.80 లక్షల టన్నులే

రాష్ట్రంలో ప్రస్తుతం 2.80 లక్షల టన్నుల యూరియా మాత్రమే రెడీగా ఉంది. మే నెలకు సంబంధించి 1.62 లక్షల టన్నులు  రావాల్సి ఉండగా వివిధ కారణాలతో మే 30 వరకు లక్ష టన్నులే వచ్చింది. సీజన్‌‌కు 10.50 లక్షల టన్నుల యూరియా అవసరగం కాగా ఇంకా 7.70లక్షల టన్నులు రావాల్సి ఉంది.  మరోవైపు డీలర్ల వద్ద 64 వేల టన్నులు, సహకార సంఘాల వద్ద 54 వేల టన్నులు, మార్క్‌‌ఫెడ్‌‌ వద్ద లక్ష 56 వేల టన్నులు, వివిధ కంపెనీల వద్ద 5వేల టన్నులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు రైతులు 354 టన్నులు కొనుగోలు చేశారు. నాట్లు ప్రారంభం నుంచి యూరియా కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు స్టాక్‌‌ పెరిగితే కానీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని, లేక పోతే ఇబ్బందేనని తెలుస్తోంది. అయితే బఫర్‌‌ స్టాక్‌‌ కనీసం 4.50 లక్షల టన్నులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక్క టన్ను కూడా లేదు. అట్లనే మే నెలలో రావాల్సిన 47వేల టన్నుల ఇంపోర్ట్‌‌ యూరియా, ఇండీజినియస్‌‌ యూరియా 15వేల టన్నులు తక్కువుంది.

ఈ సీజన్‌‌లో 22.30 లక్షల టన్నుల ఎరువులు అవసరం..

రాష్ట్రంలో వానాకాలం పంట సాగుకు 22.30 లక్షలకు పైగా ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనాలు ఉన్నాయి. 10.50 లక్షల టన్నుల యూరియాతో పాటు 1.5 లక్షల టన్నుల డీఎపీ అవసరం. ఇప్పటి వరకు  81వేల టన్నుల డీఏపీ మాత్రమే ఉంది. ఇంకా దాదాపు 45 శాతం తక్కువగా రావాల్సి ఉంది. డీలర్ల వద్ద 41వేల టన్నుల డీఏపీ ఉన్నది. సొసైటీల వద్ద కేవలం 5వేల టన్నులే ఉన్నది. 8 లక్షల మెట్రిక్ టన్నుల నత్రజని, పాస్ఫరస్‌‌, పొటాషియం ఎరువులు(ఎన్‌‌పీకే) అవసరం కాగా ఇప్పటి వరకు 3.02లక్షల టన్నులే రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓపీలు అవసరం ఉండగా కేవలం 21వేల టన్నులే ఉంది. సల్ఫర్‌‌కు కేవలం ఏడు వేల టన్నులు మాత్రమే ఉంది.

కరోనాతో దిగుమతులపై ఎఫెక్ట్‌‌

రాష్ట్రానికి కేటాయించే ఎరువుల్లో కొంత భాగం విదేశాల నుంచి వస్తుంది. ప్రధానంగా ఇండీజినియస్‌‌ యూరియా, ఎరువుల ముడి సరుకులు ఇంపోర్ట్‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌‌తో సప్లై చేసే దేశాల్లో ఎక్స్‌‌పోర్ట్‌‌ చేసే పరిస్థితి లేదు. ఒక వేళ సస్లై చేయడానికి రెడీగా ఉన్నా షిప్‌‌యార్డులు, రైల్వే రేక్‌‌ పాయింట్లు కార్మికుల కొరతతో దాదాపు మూతపడ్డాయి. దీంతో దిగుమతులు కష్టంగా మారాయి. మే నెలలోనే 45 వేల టన్నుల యూరియా, 15వేల టన్నుల ఇండీజినియస్‌‌ ఎరువుల కొరత ఏర్పడింది. జూన్‌‌కు సంబంధించి ఇంత కంటే ఎక్కువ కొరత పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్

Latest Updates