వరుస సెలవులతో పోలింగ్​పై ఎఫెక్ట్?

  • పోలిం గ్ డేతో కలిపి 4 రోజులు హాలిడేస్
  • ఊళ్లకు, టూర్లకు సిటీ పబ్లిక్
  • గత రెండు గ్రేటర్‌ ఎన్నికల్లో
  • 50 శాతం లోపే పోలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా తక్కువగా పోలింగ్ నమోదయ్యేది జీహెచ్ ఎంసీలోనే. గ్రేటర్ లో పోలింగ్ శాతం పెంచేందుకు కొన్నేళ్లుగా ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే చదువుకున్న వాళ్లు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నారు. కానీ ఓటింగ్ మాత్రం 50 శాతానికి మించటం లేదు. 2009 ఎన్నికల్లో 42.92 శాతం, 2016లో 45.27 శాతమే పోలింగ్ నమోదైంది. ఇప్పుడు దీనికి తోడు వరుస సెలవులు వస్తున్నాయి. 28, 29, 30 తేదీల్లో హాలిడేస్ కావడం, పోలింగ్ జరిగే డిసెంబర్ 1 కూడా ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో పోలింగ్ శాతం మరింతగా తగ్గే చాన్స్ ఉందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

ఊళ్లు.. టూర్లకు..

సాధారణంగా ఐటీ ఉద్యోగులకు శనివారం, ఆదివారం సెలవుంటుంది. సోమవారం గురునానక్ జయంతితో పాటు, కార్తీక పౌర్ణమి ఉంది. మంగళవారం పోలింగ్ రోజూ సెలవుంటుంది. ఇలా శనివారం నుంచి వరుసగా 4 రోజులు సెలవులొచ్చాయి. దీంతో సిటీ జనం ఊళ్లకు వెళ్తున్నారు. మరి కొందరు టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ వర్కింగ్​డేస్​లో పోలింగ్ ఉంటేనే ఓటింగ్ శాతం అంతంతమాత్రంగా నమోదవుతుంది. మరి వరుసగా 4 రోజులు సెలవులు వస్తే ఓటింగ్ పెరిగే అవకాశాలు చాలా తక్కువని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

ఐటీ కంపెనీలకు సెలవు ఇయ్యట్లే

గ్రేటర్ హైదరాబాద్​లో అసెంబ్లీ, లోక్ సభ, జీహెచ్ఎంసీ ఇలా ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. కానీ లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్న గ్రేటర్ లో కంపెనీలు సెలవులు ఇవ్వటం లేదు.  ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నాయని, ఉద్యోగులు రాకుంటే నష్టమని, అందుకే సెలవులు ఇవ్వట్లేదని చెబుతున్నాయి. దీంతో ఐటీ ఎంప్లాయిస్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపటం లేదు. గ్రేటర్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావటానికి ఇదీ ఓ కారణమని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. మరోవైపు మార్చి నుంచి కరోనా, లాక్ డౌన్ వల్ల ఐటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఆఫీస్ కు వెళ్లినప్పటి కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఎక్కువ పని వర్క్ ఉంటోందని ఉద్యోగులు చెబుతున్నారు.

పోలింగ్ పై ప్రభావం ఉంటది

వరుస సెలవుల ప్రభావం పోలింగ్ ఉంటుంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువ శాతం టూర్లకు వేరే ప్రాంతాల కు వెళ్తుంటారు. 2016 గ్రేటర్ ఎన్నికలూ సంక్రాంతి టైమ్‌‌లో పెట్టడంతో పోలింగ్ తగ్గింది. ఇప్పుడూ మంగళవారం కాకుండా గురు, శుక్రవారాల్లో పోలింగ్ పెడితే ఓటింగ్ పెరిగేది.

– పద్మానాభరెడ్డి,
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి

ఓటేయాలని ప్రచారం చేస్తున్నం

ఐటీ ఉద్యోగులంతా ఓట్లు వేసేలా ఆన్ లైన్ లో అవగాహన కల్పిస్తున్నం. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నం. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నం. ఐటీ ఎంప్లాయిస్ అందరూ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. కాబట్టి అందరూ ఓటేయాలని చెబుతున్నం.

– సందీప్ మక్తాల, గ్లోబల్ ప్రెసిడెంట్, టీటా

Latest Updates