గోదావరి-కావేరి నదుల లింక్​కు ప్రయత్నాలు

అన్ని రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కేంద్రం అడుగులు

18న ఎన్ డబ్ల్యూడీఏ మీటింగ్

తమ అవసరాలు తీరాకే ప్రాజెక్టు చేపట్టాలన్న ఏపీ, తెలంగాణ

గోదావరిలో మిగులు జలాలే లేవని స్పష్టం

హైదరాబాద్‌‌, వెలుగుగోదావరి-కావేరి లింక్‌‌ ప్రాజెక్టుపై కేంద్రం ఫోకస్‌‌ పెట్టింది. గోదావరి బేసిన్‌‌లోని అన్ని రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చి రివర్‌‌ లింకింగ్‌‌ ప్రాజెక్టును చేపట్టే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఏళ్లకేళ్లుగా చర్చల స్థాయిలోనే నలుగుతున్న ఈ ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది. ఈనెల 18న గోదావరి బేసిన్‌‌లోని రాష్ట్రాలతో ఎన్‌‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్ మెంట్ ఏజెన్సీ) సమావేశం ఏర్పాటు చేసింది. చెన్నైతోపాటు తమిళనాడు రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాల కోసం గోదావరి లింక్‌‌ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం అంచనాకు వచ్చింది.

20 ఏళ్లుగా ప్రయత్నాలు

సౌత్​ ఇండియాలో ఎక్కువ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న చెన్నైతో పాటు తమిళనాడులోని కావేరి నది ఆయకట్టుకు సాగునీటిని ఇచ్చేందుకు గోదావరి (మహానది)-కావేరి లింక్‌‌ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఎక్కడి నుంచి నీటి మళ్లింపు చేపడితే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే దానిపై సర్వే కూడా చేయించింది. రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్‌‌ అడిగి తీసుకుంది. తెలంగాణలోని ఇచ్చంపల్లి, ఆకినెపల్లి, జానంపేట నుంచి నీటిని తీసుకోవడానికి అనుకూలంగా ఉందని నిర్ణయానికి వచ్చింది. ఈ మూడు పాయింట్లలో ఏదో ఒక చోటు నుంచి నీటిని ఎత్తిపోసి పైపులైన్ల ద్వారా నాగార్జునసాగర్‌‌కు అటు నుంచి సోమశిలకు ఆపై గ్రాండ్‌‌ ఆనికట్‌‌ (కావేరి)కు లింక్‌‌ చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

మా అవసరాలు తీరాకే

తమ అవసరాలు తీరాకే కావేరి లింక్‌‌ ప్రాజెక్టును చేపట్టాలని ఆగస్టు 24న నిర్వహించిన ఎన్‌‌డబ్ల్యూడీఏ మీటింగ్‌‌లో తెలంగాణ, ఏపీ తేల్చిచెప్పాయి. మిగులు జలాల్లో 650 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా, 500 టీఎంసీల వరకు కేటాయించాలని ఏపీ సర్కారు సైతం కోరింది. గోదావరి అత్యధిక పరీవాహక ప్రాంతం తమ రాష్ట్రంలోనే ఉంది కాబట్టి మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని తెలంగాణ వాదించింది. 75% డిపెండబులిటీగా లెక్కిస్తే అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని తెలంగాణ, ఏపీ తేల్చిచెప్పాయి.

247 టీఎంసీలు మళ్లించేలా

గోదావరి నది నుంచి ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలోని ఇచ్చంపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆకినెపల్లి, జానంపేటలో ఏదో ఒక పాయింట్‌‌ నుంచి నీటిని తీసుకోవాలని ఎన్‌‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆకినెపల్లి వద్ద 50 పర్సెంట్‌‌ డెపెండబులిటీగా లెక్కిస్తే 289 టీఎంసీలు, 75 పర్సెంట్‌‌ డిపెండబులిటీగా లెక్కిస్తే 427 టీఎంసీల మిగులు జలాల లభ్యత ఉందని గతంలో ఎన్‌‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది. వాటిలోంచి 247 టీఎంసీలను మళ్లించేందుకు ఇంటర్‌‌ స్టేట్‌‌ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు ప్రకటించింది. అందుకు అన్ని రాష్ట్రాల సమ్మతి కోరింది. కానీ ఇంతవరకు రివర్‌‌ లింకింగ్‌‌ ఇంటర్‌‌ స్టేట్‌‌ ప్రాజెక్టుపై ఏకాభిప్రాయం కుదరలేదు. గోదావరి నుంచి మళ్లించే నీటిని మొదట సాగర్‌‌కు ఎత్తిపోసి అక్కడి నుంచి పెన్నా బేసిన్‌‌లోని సోమశిలకు తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గ్రాండ్‌‌ ఆనికట్‌‌ (కావేరి)కు నీటిని తీసుకుపోతారు. ఇలా తరలించే నీటిలో ఏపీకి 81 టీఎంసీలు, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీల నీటిని ఇస్తామని పేర్కొన్నారు.

ఏకాభిప్రాయం కుదిరేనా?

గోదావరి-కావేరి మళ్లింపు ప్రాజెక్టుపై బేసిన్‌‌లోని ఒడిశా, ఛత్తీస్‌‌గఢ్‌‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం అంత సులభం కాదు. ఇంతకాలం తమ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేపట్టలేదు కాబట్టి గోదావరిలో వరద ఎక్కువగా ఉందని, భవిష్యత్‌‌లో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని ఒడిశా, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ మిగులు జలాల్లో అధిక వాటా ఇవ్వాలని డిమాండ్‌‌ చేస్తున్నాయి. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే రివర్‌‌ లింకింగ్‌‌ ప్రాజెక్టుకు ఓకే చెప్తామని తేల్చిచెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో 18న నిర్వహించే మీటింగ్‌‌లోనూ ఏకాభిప్రాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కర్నాటక తీరుతో కావేరి బేసిన్‌‌కు తీవ్ర నష్టమని, గోదావరి లింక్‌‌ ప్రాజెక్టును చేపట్టకపోతే తాము నష్టపోతామని తమిళనాడు ప్రభుత్వం చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానానికి కేంద్రం ఎలా ఒప్పిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Latest Updates