గుడ్డు 10 రూపాయలైతదా..?

హైదరాబాద్, వెలుగు:

కోళ్ల దాణా ధరలు పెరిగిపోవడం, గిట్టుబాటు రాక పౌల్ట్రీ యజమానులు లేయర్​ ఫారాలను మూసేస్తుండటం కోడిగుడ్ల ధరలపై ఎఫెక్ట్​ చూపిస్తోంది. దానికితోడు చలికాలం రావడం, కార్తీక మాసం ముగియడంతో దేశవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్​ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోడిగుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని.. ఇప్పుడున్న ఐదు రూపాయల స్థాయి నుంచి కొద్దిరోజుల్లో ఏడు రూపాయలకు చేరొచ్చని మార్కెట్​ వర్గాలు చెప్తున్నాయి. ఇలాగే లేయర్​ కోళ్ల ఫారాలు మూతపడితే, దాణా ధరలు పెరుగుతూ పోతే.. కోడిగుడ్ల ధరలు రూ.10కి చేరే అవకాశం ఉందని అంటున్నాయి.

వానల దెబ్బతో..

గుడ్ల (లేయర్) కోళ్లకు మక్కలు, సోయా ఉత్పత్తులను దాణాగా వాడుతారు. గత ఏడాది మొక్కజొన్న, సోయా పంట దిగుబడులు తక్కువగా వచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదట్లో సరిగా వానల్లేక వాటి సాగు తగ్గగా.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కురిసిన భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి మక్కలు, సోయా దిగుబడులు సగానికి తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. అటు విదేశాల నుంచి దిగుమతులు కూడా తగ్గాయి. దీంతో ధరలు పెరిగి పౌల్ట్రీపై ప్రభావం చూపుతున్నాయి. దాణా ధరలు పెరగడంతో ఒక్కో గుడ్డుకు రూపాయి, రూపాయిన్నర వరకు నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు.

ఫారాలు మూసేస్తున్నరు

పౌల్ట్రీ రైతులు గత రెండేండ్లుగా కోళ్ల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న ధర క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.2 వేల వరకు, సోయా ధర రూ.4 వేల వరకు ఉన్నాయి. అంత ధర పెట్టి కొని, లేయర్​ కోళ్లను పెంచడం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. కొత్తగా లేయర్​ కోడి పిల్లలను పెంచడం లేదని, పాత కోళ్ల నుంచి ఉత్పత్తి తగ్గిపోగానే తీసేస్తున్నామని చెప్తున్నారు. ఇది మెల్లగా గుడ్ల ఉత్పత్తిపై ఎఫెక్ట్​ చూపుతోంది. ఇప్పటికే డిమాండ్​కు మేర గుడ్లు సరఫరా కాని పరిస్థితి మొదలైంది. సప్లై మరింతగా తగ్గుతుండటంతో ధరలు పెరుగుతాయని మార్కెట్​వర్గాలు వెల్లడించాయి.

మద్దతు ధర కల్పించాలె..

రెండేండ్లుగా ఒక్కో గుడ్డుపై రూపాయికిపైగా నష్టపోతున్నామని పౌల్ట్రీ నిర్వాహకులు చెప్తున్నారు. ధర తక్కువగా ఉన్న సమయంలో మద్దతు ధర కల్పించాలని, దాణా ధరలకు అనుగుణంగా సవరించాలని సర్కారును కోరుతున్నారు. పౌల్ట్రీ షెడ్డులకు వేసే ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.5 వరకు ఉన్నా తమకు అందేది రూ.4 లోపేనని.. అదే రూ.5 వస్తే నష్టం లేకుండా ఉంటుందని అంటున్నారు. అంతకన్నా ఎక్కువ ధర ఉంటేనే లాభం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ధర కొంత మెరుగ్గా వస్తోందని.. కానీ మిగతా టైంలో హోల్​సేల్​ ధరలు రూ. 3 కన్నా తక్కువే ఉంటున్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం గుడ్డు హోల్​సేల్​ ధర రూ.4.40 ఉండగా రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.5 వరకు ఉంది. ధర తగ్గేటప్పుడు ప్రభుత్వం సహకారం అందించాలని రైతులు కోరుతున్నారు.

 

Latest Updates