ఐఫిల్ టవర్‌ను అమ్మేశాడు

eiffel-tower-was-sold

‘‘చార్మినార్ నీదా? హా.. నేను నమ్మను. ..అందుకే నిన్ను మీ నాన్న పనికిమాలిన వెధవా అని తిట్టేది. ఏయ్ మస్తాను నేనేం కొన్నానయ్యా(చేతిలో చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ చూపుతూ)? చార్మినార్! ఇప్పటికైనా నమ్ముతావా లేకపోతే సీఎంతోనూ, గవర్నర్ తోనూ చెప్పించాలా? మనది బొబ్బర్లంక రిలేషన్ షిప్పు కాబట్టి ఓ పదివేలివ్వు చాలు’ అంటూ అమ్మో ఒకటో తారీఖు సినిమాలో బ్రహ్మానందానికి తనికెళ్ల భరణి చార్మినార్‌‌ అమ్మే సీన్‌‌ గుర్తుందా?

అచ్చం అలాగే ఓ వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌‌ను అమ్మేశాడు. అతని పేరు విక్టర్ లస్టిగ్. అసలు పేరు రాబర్ట్ వి మిల్లర్. 1890లో హంగరీలో పుట్టాడు. పారిస్‌‌లో చదువుకునే రోజుల్లో జూదం, జేబులు కొట్టడం, దొంగతనాలకు మరిగాడు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన కోసం ఐఫిల్ టవర్‌‌ను కట్టారు. ఆ ప్రదర్శన ముగిసిన తర్వాత టవర్‌‌ను తొలగించాలనే డిమాండ్ మొదలైంది. ఆ వార్తను ఓ న్యూస్ పేపర్ లో లస్టిగ్ కంటపడింది. వెంటనే ఓ మెరుపులాంటి ఐడియా తట్టిందతనికి. ఐఫిల్ టవర్‌‌ను పడగొట్టి ఆ తుక్కును అమ్మాలని ఫ్రాన్స్ సర్కారు నిర్ణయించినట్లు లస్టిగ్ దొంగ పత్రాలు తయారు చేశాడు. అప్పట్లో తుక్కు వ్యాపారంలో దిగ్గజాలుగా పేరుపొందిన ఐదుగురిని ఎంచుకున్నాడు. చివరిని యాండ్రీ పోసాన్ అనే వ్యాపారిని టార్గెట్ చేశాడు. తుక్కు ఇప్పిస్తాను అని అతడిని నమ్మించాడు. ఇందుకు యాండ్రీ నుంచి 70 వేల డాలర్లు(నేడు 10 లక్షల డాలర్లతో సమానం) లంచంగా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత చేతికందిన సొమ్ము తీసుకుని ఆస్ట్రియాకు చెక్కేశాడు. బాధితుడు కేసు పెట్టకపోవడంతో మరోసారీ అమ్మే ప్రయత్నం చేశాడు.  ఈ సారి విషయం పోలీసులను చేరింది. లస్టిగ్ వెంటనే అమెరికాకు పారిపోయాడు. అక్కడా అంతే. ఓ కరెన్సీ నోటును లోపల పెడితే, రెండుగా మారుతుందని నమ్మించి ఓ పెట్టెను అమ్ముతూ మోసం చేయడం మొదలుపెట్టాడు.  ఈ పెట్టెకు ‘రుమేనియన్ బాక్స్’ అని పేరు పెట్టాడు. చివరికు లస్టిగ్‌‌ గర్ల్ ఫ్రెండే అతడిని పోలీసులకు పట్టిచ్చింది. మరో అమ్మాయితో తిరుగుతున్నాడన్న కోపంతోనే అలా చేసింది. విచారణ సమయంలో లస్టిగ్ ఓసారి జైలు నుంచి తప్పించుకున్నాడు కూడా. మళ్లీ పట్టుబడి కోర్టులో నేరం అంగీకరించి జైలుకు వెళ్లాడు. నిమోనియాతో చనిపోయాడు.

Latest Updates