హ్యాట్సాఫ్ సునైనా: నక్సల్స్ వేటలో 8 నెలల గర్భవతి

‘ఆమె’ ఓ శక్తి.. ఆమె తలచుకుంటే ఏమైనా చేయగలదు. అమ్మగా లాలించనూ గలదు.. అపర కాళిగా మారి దుష్టులను అంతమొందించనూ గలదు. చిన్న కణంతో మనిషినే సృష్టించి.. ప్రాణం పోసి భూమిపైకి తేగల దేవతామూర్తి ఆమె. ఎంతో సహనంతో కుటుంబం మొత్తాన్ని నడిపించుకోగల శాంతమూర్తి. ఓ సోదరిగా.. భార్యగా, తల్లిగా అన్ని రకాల బాధ్యతలను నిర్వర్తిస్తూనే నారీ శక్తి అనుకుంటే ప్రపంచంలో ఏమైనా చేయగలమని సత్తాను చాటుతూనే ఉంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనోధైర్యంతో యుద్ధ వాతావరణంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఓ ధీర వనిత గురించి తెలుసుకుందాం.

దండకారణ్యంలో ధీర వనిత

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం.. దేశంలోనే నక్సలైట్లకు పెట్టని కోట అది. దంతెవాడ ప్రాంతలోని అడవుల్లో మావోయిస్టులు ఎప్పుడూ క్రియాశీలంగానే ఉంటారు. ఏ సమయంలో ఎక్కడ ఎన్‌కౌంటర్లు జరుగుతాయో తెలియని ప్రాంతమది. పోలీసులు, నక్సలైట్ల మధ్య హోరాహోరీ కాల్పుల ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి ప్రాంతంలో 8 నెలల గర్భంతో ఓ మహిళ ఏకే 47 చేతబట్టి.. అడవుల్లో కూబింగ్ చేయడం.. ఊహకే ఇది ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది కదా! కానీ ఇది నిజం. ఆ ధీర వనిత పేరు సునైనా పటేల్. దంతెవాడ ప్రాంతంలో నక్సల్స్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన ‘దంతేశ్వరి ఫైటర్స్’ను లీడ్ చేస్తున్న కమాండర్ ఆమె.

పూర్తి మహిళల ఫోర్స్

Eight months pregnant woman Sunaina Patel on commando duty at Dantewada in ‘Danteshwari Fighters’2019 మే నెలలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగం ‘దంతేశ్వరి ఫైటర్స్’.  పూర్తిగా మహిళలతో కూడిన ఫోర్స్ ఇది. నక్సల్ ఉద్యమం నుంచి లొంగిపోయిన మహిళలు, లేడీ పోలీసులకు కఠినమైన కమాండో శిక్షణ ఇచ్చి వారిని దంతెవాడ అడవుల్లో నక్సల్స్ ఏరివేతకు నియమించింది ప్రభుత్వం. దంతెవాడలోని గిరిజనులు తమ కులదైవంగా పూజించే దంతేశ్వరి మాత పేరుతో ఈ ఫోర్స్‌ను ప్రారంభించింది. దంతేశ్వరి మాతను పార్వతి దేవి అంశంగా 52 శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు.

గర్భవతి అన్న విషయం దాచి డ్యూటీలోకి..

ఆయుధ బలగాలలో అడుగుపెట్టాలని సునైనా పటేల్‌ చిరకాల లక్ష్యం. ఆమె ఎంతో కఠోర శిక్షణకు నిలబడి.. దంతేశ్వరి ఫైటర్స్‌లో స్థానం సాధించింది. ఫోర్స్‌లో చేరే నాటికే ఆమె రెండు నెలల గర్భవతి. ఈ విషయం తెలిస్తే తనను ఈ విభాగంలోకి తీసుకోరని అధికారులకు తెలియనీయకుండా దాచిపెట్టింది. భర్త భాస్కర్‌తో విషయం చెప్పి.. తాను దండకారణ్యంలో డ్యూటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. సునైనా పట్టుదలను చూసి.. ఆయన అండగా నిలిచారు. డాక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుని డ్యూటీలో కొనసాగేలా ఏర్పాటు చేశారు. కొండలు, నదులతో దట్టంగా ఉండే దండకారణ్యంలో కడుపులో బిడ్డతో కమాండో ఆపరేషన్లలో పాల్గొంది. సునైనా పనితీరు చూసి ఆమెను టీమ్ కమాండర్‌గా నియమించారు ఉన్నతాధికారులు. ఆరున్నర నెలల గర్భవతిగా ఉన్న సమయంలో కడుపు తెలియడంతో తోటి వారు ఆమె మనోధైర్యాన్ని చూసి షాకయ్యారు. అన్నాళ్లు గర్భంతో ఉన్న విషయాన్ని దాచి ఆ అడవిలో ఏ మాత్రం ఆత్మస్థైర్యం తగ్గకుండా డ్యూటీ చేసిన తీరుతో తమలో మరింత ధైర్యం నింపిందని తోటి ఫైటర్స్ చెబుతున్నారు. తాను ఎప్పుడూ ఏరకమైన డ్యూటీ వేసినా వెనుకడుగు వేయలేదని చెబుతోంది సునైనా.

Eight months pregnant woman Sunaina Patel on commando duty at Dantewada in ‘Danteshwari Fighters’

సునైనా కమాండర్ అయ్యాక…

Eight months pregnant woman Sunaina Patel on commando duty at Dantewada in ‘Danteshwari Fighters’దంతేశ్వరి ఫైటర్స్‌ టీమ్ మొత్తాన్ని సునైనా ఓ ఇన్‌స్పిరేషన్ అని చెప్పారు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్. ఆమె గిరిజన ప్రాంతాల్లో మహిళలను కూడా మోటివేట్ చేసేదని అన్నారు. గర్భవతి అని తెలిశాక సెలవు తీసుకోవాలని చెప్పినా ఆమె ఒప్పుకోలేదని, పట్టుదలగా డ్యూటీలో ముందుకు సాగిందని తెలిపారు. ఆమె కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్నాక దంతేశ్వరి ఫైటర్స్‌లో మహిళా కమాండోల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె తేలికపాటి విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest Updates