8 రాష్ట్రాలు 290 జిల్లాలు కరోనా ఫ్రీ

న్యూఢిల్లీ, వెలుగుదేశంలో ఎనిమిది రాష్ట్రాలు, 290 జిల్లాలు కరోనా ఫ్రీగా మారాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు. చిన్న రాష్ట్రాలైన గోవా, త్రిపుర, నాగాలాండ్, యూటీలు దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ, లక్ష్యద్వీప్ లో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు లేదన్నారు. అయితే, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్(ఇండోర్), తెలంగాణ(హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్(కర్నూలు), తమిళనాడు(చెన్నై)లో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్​రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో లాక్ డౌన్ ఎత్తేసే అంశంపై ప్రధాని మోడీ.. సీఎంల సమావేశంలో అభిప్రాయాలు తీసుకున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత తొందరగా లాక్ డౌన్ ఎత్తేయాలని సర్కారు భావిస్తోందని, ఈ నెల 20 తర్వాత ఒక్కొక్కటిగా ఇస్తున్న సడలింపులు ఇందులో భాగమేనని తెలిపారు. కరోనా వ్యాప్తి, కేసుల నమోదు తీవ్రతను బట్టి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి

లాక్ డౌన్ ఎత్తేసినా జనం రెండు నెలల వరకు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులను వాడాలని, సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని కోరారు. మే 3 వరకూ లాక్ డౌన్ ఉన్నందున, గ్రౌండ్ లెవల్ లో వైరస్​ వ్యాప్తిపై కలెక్టర్ల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని, వీటి ఆధారంగా పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు. దేశంలో కరోనా కేసులు పెరగడానికి మర్కజ్ సమావేశాలే కారణమయ్యాయని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో బయటపడ్డ కేసుల్లో 65% మర్కజ్ తో లింక్​ ఉన్నవేనని చెప్పారు. మర్కజ్ ఘటన జరిగి ఉండకపోతే, ప్రపంచంలో దేశానికి అద్భుతమైన పేరు వచ్చేదన్నారు. అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన మనదేశంలో కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయాల వల్లే వైరస్​ వ్యాప్తిని అడ్డుకోగలిగాయని చెప్పారు. ఎంత త్వరగా దేశం నుంచి వైరస్ ను పారద్రోలితే.. అంత త్వరగా పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.

దసరా, దీపావళి తర్వాతే సొంతూర్లకు..

దసరా, దీపావళి తర్వాతే వలస కూలీలు సొంతూర్లకు వెళ్లాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది వలస కూలీలు ఉన్నారని, లాక్ డౌన్ ఎత్తేశాక వారందరూ ఒకేసారి తిరుగు ప్రయాణం కావడం ఇబ్బందులకు దారి తీస్తుందని చెప్పారు. ప్రత్యేక రైళ్లు, వాహనాలను ఏర్పాటు చేసి వారిని సొంతూర్లకు పంపించే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖలను ఆదేశించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో ఇండియా పెట్టుబడులకు కేరాఫ్ గా మారబోతోందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై ప్రపంచ దేశాలకు నమ్మకం తగ్గిందని, అందువల్ల వివిధ దేశాలు, పెద్ద సంస్థలు మనవైపు చూస్తున్నాయని చెప్పారు.

Latest Updates